Begin typing your search above and press return to search.

గోల్డ్ స్మ‌గ్లింగ్.. అమాయ‌కురాలిని ట్రాప్‌లో వేసారు

కన్నడ నటి రన్యా రావు బంగారం స్మ‌గ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కెంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాక ర‌న్యాపై విచార‌ణ మొద‌లైంది

By:  Tupaki Desk   |   10 March 2025 1:00 AM IST
గోల్డ్ స్మ‌గ్లింగ్.. అమాయ‌కురాలిని ట్రాప్‌లో వేసారు
X

కన్నడ నటి రన్యా రావు బంగారం స్మ‌గ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కెంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాక ర‌న్యాపై విచార‌ణ మొద‌లైంది. తాజా స‌మాచారం మేర‌కు.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రశ్నల సమయంలో ర‌న్యా రావు క‌ళ్ల‌నీళ్ల ప‌ర్యంత‌మై విలపించారు. తాను నిర్దోషిని అని ర‌న్యారావు చెబుతున్నారు. తన న్యాయవాదులకు తాను నిద్రపోలేకపోతున్నానని చెప్పిన తర్వాత కార‌ణాల‌పై ఆలోచించాన‌ని ర‌న్యా తెలిపారు. నేను ఈ ఊబిలోకి ఎందుకు వచ్చాను? అని ఆలోచిస్తూ ఉండ‌టంతో నిదుర ప‌ట్ట‌డం లేద‌ని ర‌న్యా అన్నారు.

నేను ఈ ఊబిలోకి ఎలా వ‌చ్చాను అని ఆలోచిస్తూనే ఉన్నాను. నా మనస్సు విమానాశ్రయంలో ఆ రోజుకి తిరిగి వెళుతోంది.. దానివ‌ల్ల‌ నేను నిద్రపోలేకపోతున్నాను... మానసికంగా బాధపడుతున్నాను! అని ఆమె తన న్యాయవాదులతో కన్నీళ్లు పెడుతూ చెప్పుకున్న‌ట్టు డిఆర్ఐ అధికారులు గ‌తంలో ప్ర‌క‌టించారు.

అయితే ర‌న్యారావు ఇంత‌లోనే వాద‌న మార్చార‌ని కూడా అంటున్నారు. తాజా వాదన డిఆర్ఐకి ఇచ్చిన అధికారిక ప్రకటనకు విరుద్ధంగా ఉంది. తాను నిర్ధోషిని అని ర‌న్యారావు ఇప్పుడు వాదిస్తోంది. కానీ ఇంత‌కుముందు 17 బంగారు కడ్డీలతో పట్టుబడినట్లు ర‌న్యా అధికారుల ఎదుట అంగీకరించింది. కేవ‌లం దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్, అమెరికా, మధ్యప్రాచ్యానికి కూడా ర‌న్యా ప్రయాణించిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది.

అయితే ర‌న్యా తాజా ప్ర‌క‌ట‌న‌ను అనుస‌రించి, ఆమె ట్రాప్ లో ఇరుక్కుందా? ర‌న్యా ట్రాప్ లో చిక్కుకోవ‌డానికి దారి తీసిన పరిస్థితులను కూడా వెల్లడించాలని అధికారులు కోరుకుంటున్నారు. ఈ కేసు గత సంవత్సరం చెన్నైలో జరిగిన సంఘటనతో సారూప్యతలను కలిగి ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. అప్ప‌ట్లో కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుండి 12 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. బంగారం స్మగ్లింగ్‌లో పాల్గొన్న స్నేహితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడని దర్యాప్తులో తేలింది. అదే త‌ర‌హాలో రన్యా రావుకు స‌న్నిహితుల్లో ఎవ‌రో ఒక‌రు త‌న‌ను ఇరికించి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు.

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ‌రీరం చుట్టూ బెల్టులో 12 కోట్ల విలువైన బంగారు కడ్డీల‌ను అమ‌ర్చుకుని క‌నిపించ‌గా, అరెస్టు చేశారు. మార్చి 10 వరకు డిఆర్ఐ కస్టడీకి తరలించారు. అధికారులు ఆమె ఇంటి నుండి కోట్లాది రూపాయ‌ల‌ విలువైన నగదు, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ర‌న్యా రావు కర్ణాటక సీనియర్ ఐపిఎస్ అధికారి కె రామచంద్రరావు సవతి కుమార్తె. ఆమె తన భర్త జతిన్ హుక్కేరితో నివసిస్తున్నప్పటి నుండి ఏం చేస్తుందో తనకు తెలియదని చెబుతూ స‌వ‌తి తండ్రి ర‌న్యా రావు నుండి దూరంగా ఉన్నారు. మరోవైపు, సిబిఐ అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.