బంగారం స్మగ్లింగ్: రన్యారావు ఫోన్ కాంటాక్ట్స్‌లోని VVIPల్లో టెన్షన్ టెన్షన్
కన్నడ నటి రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 March 2025 9:07 AM ISTకన్నడ నటి రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేసిన కేసులో అధికారులు రన్యాను కస్టడీలోకి తీసుకుని ఇన్ డెప్త్ గా విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆమె సవతి తండ్రి, డిజిపి రామచంద్రాను పోలీసులు విచారిస్తున్నారని కథనాలొచ్చాయి. రన్యారావు విమానాశ్రయంలో తప్పించుకునేందుకు ఆయన సహకరించారని అభియోగాలు నమోదయ్యాయి.
ప్రస్తుతం రన్యారావు ఫోన్ కాంటాక్ట్స్ జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, పోలీస్ బాస్ ల ఫోన్ నంబర్లను చూసి విచారణ అధికారులు షాక్ తిన్నారని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. రన్యా రావు నుండి స్మగ్లింగ్ బంగారాన్ని కొనుగోలు చేసినందుకు స్టార్ హోటల్ యజమాని తరుణ్ రాజ్ అరెస్టు అయ్యారు. బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు దానిని తిరస్కరించిందని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి.
కేసు విచారణ సమయంలో బంగారం స్మగ్లింగ్ కోసం ఒక బృందం ఎలా తనకు సహకరిస్తుందో రన్యారావు అధికారులకు వెల్లడించారు. తనకు ప్రయాణం ప్లాన్ గురించి సమాచారం అందిస్తారని.. బంగారు స్మగ్లింగ్ ఆపరేషన్‌లో తన పాత్రను ఈ బృంద సభ్యులు సులభతరం చేస్తారని రన్యా రావు వెల్లడించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. బంగారాన్ని దాచడానికి అనుకూలీకరించిన దుస్తులు ధరిస్తానని .. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలను తప్పించుకోవడానికి డిజిపి కుమార్తె అనే ట్యాగ్‌ను ఉపయోగించినట్లు రన్యారావు అంగీకరించారు.. విమానాశ్రయ భద్రతను దాటవేసిన తర్వాత, బయట వేచి ఉన్న సహచరుడికి బంగారాన్ని అప్పగించడం తన పని. రన్యారావును కస్టడీలో అధికారులు విచారించగా ఇలాంటి ఎన్నో నిజాలు బయటపడ్డాయి. ఈ విచారణలో చాలా నిజాలను రన్యారావు ఒప్పుకున్నారు.
అలాగే ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు రన్యా మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే చాలామంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల కాంటాక్ట్ నంబర్‌లు ఉన్నాయని, వారితో రెగ్యులర్ గా రన్యా టచ్‌లో ఉండేదని తేలింది. ఆమె రెగ్యులర్ కాంటాక్ట్‌లలో వ్యాపారవేత్త , స్టార్ హోటల్ యజమాని తరుణ్ రాజ్ కూడా ఉన్నాడు. రన్యా అతడికి పలుమార్లు స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని సరఫరా చేసిందని తేలింది. విచారణ సమయంలో తరుణ్ రాజ్ తో సంబంధాల గురించి రన్యా సరైన వివరణ ఇవ్వలేదు. రన్యా అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగం అతడిని అరెస్టు చేసింది. అధికారులు తరుణ్ రాజ్ వ్యాపార ఖాతాలతో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా ఇప్పటికే పరిశీలించారు. అతడి లావాదేవీలు చాలా అనుమానాలను రేకెత్తించాయి. అతడి హోటల్ తో స్మగ్లింగ్ గ్యాంగ్ కి ఉన్న సంబంధాలపై ఆరా తీసే క్రమంలో, ఆ హోటల్ ఫుటేజ్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
రన్యా రావు మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ నుండి కోట్లాది రూపాయల విలువైన బంగారంతో అధికారులకు దొరికింది. ఆమెను అరెస్టు చేసి డిఆర్ఐ అధికారులు విచారణ ప్రారంభించారు. రన్యా తన శరీరానికి బంగారం కడ్డీలను చుట్టుకుని విమానాశ్రయంలో దొరికిపోయాక అధికారులు నిర్ఘాంతపోయారు. ఆ తరవాత సుదీర్ఘ విచారణలో చాలా నిజాలు విస్తుగొలిపాయని అధికారులు వెల్లడిస్తున్నారు.