రామ్ ఫ్యాన్స్ హంగామా.. గెల మాలతో సర్‌ప్రైజ్!
ఇప్పుడీ మాస్ రిసెప్షన్‌తో RAPO22 సినిమా రాజమండ్రి షెడ్యూల్ మొదలైంది. నెల రోజుల పాటు రాజమండ్రిలోనే షూటింగ్ జరగనుంది.
By: Tupaki Desk | 10 Feb 2025 5:05 AM GMTఉస్తాద్ రామ్ పోతినేని సినిమాలంటే ఓ వర్గం ప్రేక్షకులకే పరిమితం కాదు. క్లాస్ ఆడియన్స్‌కు తనదైన రొమాంటిక్ స్టైల్‌తో దగ్గరయిన రామ్, మాస్ అభిమానులకు కూడా తన ఎనర్జీ స్కిల్స్ తో కనెక్ట్ అయ్యాడు. ఆ క్రేజ్ తాజాగా రాజమండ్రిలో మరోసారి అర్థమైంది. రామ్ పోతినేని తన కొత్త సినిమా RAPO22 షూటింగ్ కోసం గోదావరి జిల్లాలకు రాగా, అక్కడ అభిమానులు అతడికి ఇచ్చిన స్వాగతం నిజంగా ఒక సంచలనంగా మారింది.
రామ్ రాజమండ్రికి చాలా ఏళ్ల తర్వాత రాగా, ఆయనను చూడడానికి అభిమానులు భారీగా చేరుకున్నారు. గోదావరి జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చి రామ్‌కి సంబరంగా స్వాగతం పలికారు. సాధారణంగా స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్లినా అభిమానుల రభస కనిపిస్తూనే ఉంటుంది. కానీ, రాజమండ్రిలో రామ్‌కు జరిగిన ఈ స్వాగతం విభిన్నంగా నిలిచింది. అభిమానుల హడావుడి మాత్రమే కాకుండా, భారీ క్రేన్ సహాయంతో ఓ అద్భుతమైన గిఫ్ట్‌ను అందజేయడం జరిగింది.
అభిమానులు ప్రత్యేకంగా గెల మాల (అరటి పండ్ల మాల)ను సిద్ధం చేసి, దాన్ని క్రేన్ ద్వారా రామ్‌కు అందజేశారు. ఒక టాలీవుడ్ హీరోకు అభిమానులు గెల మాల వేసి స్వాగతం పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. అభిమానుల ఈ వినూత్న ఆలోచన అక్కడి ప్రజలను, నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రామ్ కూడా అభిమానుల ప్రేమను చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే కాకుండా, రామ్ రాజమండ్రికి తిరిగి రావడం గడిచిన పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ తపనకు ముగింపు పలికేలా ఆయన రాక జరిగింది. దీన్ని అభిమానులు ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారో వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే రామ్, అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇప్పుడీ మాస్ రిసెప్షన్‌తో RAPO22 సినిమా రాజమండ్రి షెడ్యూల్ మొదలైంది. నెల రోజుల పాటు రాజమండ్రిలోనే షూటింగ్ జరగనుంది. మహేశ్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భవ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, రామ్‌కి ఇచ్చిన ఈ గ్రాండ్ వెల్‌కమ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.