అరుదైన రుగ్మతలతో స్టార్లు సతమతం
ఇంతలోనే మరో సౌత్ కథానాయిక ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి షాక్ కి గురి చేసింది.
By: Tupaki Desk | 4 Dec 2023 4:56 AM GMTసెలబ్రిటీల ఖరీదైన జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని కొందరు అనుకుంటారు. కానీ మానవ జీవితంలో ఇది కుదరదు. అన్నీ ఉన్నా ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఇది దైవ నిశ్చయం, కర్మ ఫలాల ఫలితం అని ఆధ్యాత్మిక గురువులు విశ్లేషిస్తే, అందుకు భిన్నంగా నాస్తికులు, ఎర్ర జెండా ఉద్యమకారుల విశ్లేషణలు సాగుతుంటాయి. కొన్ని నెలల క్రితం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులకు వెల్లడించింది. రుగ్మత ప్రధాన లక్షణాల గురించి చెప్పగా అభిమానులు కలత చెందారు. బలహీనంగా ఉండడం.. భరించలేని కండరాల నొప్పి గురించి సమంత వెల్లడించగా ఫ్యాన్స్ తీవ్ర కలత చెందారు. సమంత త్వరగా కోలుకుని సినిమాల్లో నటించాలని అభిమానులు ఆకాంక్షించారు.
ఇంతలోనే మరో సౌత్ కథానాయిక ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి షాక్ కి గురి చేసింది. తనకు విటిలిగో అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి సోకిందని నటి కం గాయని మమతా మోహన్ దాస్ వెల్లడించారు. ఈ వార్త వినగానే అంతా షాక్ తిన్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మలయాళంలో తిరిగి కెరీర్ పరంగా కంబ్యాక్ అవుతున్న మమతా మోహన్ దాస్ తన సమస్యను బహిరంగ వేదికపై ఓపెన్ గా వెల్లడించడంతో తన గట్స్ ని మెచ్చుకోని వారు లేరు.
కొన్నేళ్ల క్రితం కండల హీరో సల్మాన్ ఖాన్ కు ట్రిజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇది ముఖం ఒక వైపున విద్యుత్ షాక్ వంటి బాధాకరమైన ఫీలింగ్ ని కలిగించే పరిస్థితి. యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ టెన్నిస్ ఎల్బో తో మాత్రమే కాదు OCD సమస్య తో కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని కాజోల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. యామీ గౌతమ్ నిస్సందేహంగా బాలీవుడ్ లో అందమైన ప్రతిభావంతమైన నటి. 2021లో నటి కెరటోసిస్ పిలారిస్ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నానని బహిరంగంగా వెల్లడించింది. బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకున్న యామి ఫ్యాన్స్ తీవ్రంగా కలత చెందారు. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ తన ఒక ఇంటర్వ్యూలో తనకు డయాబెటిస్ ఉందని చెప్పింది. యుక్తవయస్సు నుండి ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించింది.
గత సంవత్సరం బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఒక కార్యక్రమంలో యువ ధావన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. నాకు వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే రుగ్మత ఉందని బహిరంగంగా వెల్లడించడంతో అంతా షాక్ తిన్నారు. అభిమానులు తీవ్ర కలతకు గురయ్యారు. ఈ వ్యాధి లక్షణం ప్రాథమికంగా బ్యాలెన్సింగ్ ఆఫ్ అవుతుంది. కానీ నేను నన్ను చాలా కనిపెట్టుకుని ఉంటాను.. అని వరుణ్ ధావన్ తెలిపారు. ఇంకా చాలా మంది స్టార్లకు వింతైన సమస్యలున్నాయి. వాటిలో బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అభిమానులు కలత చెందడం వరకే... కానీ విధిని మార్చలేరు!!