Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లో అద‌ర‌గొడుతున్న సౌత్ బ్యూటీ

ఇది మ‌ళ్లీ ర‌ష్మిక కెరీర్ గ్రాఫ్ ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించింది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 10:30 PM GMT
బాలీవుడ్‌లో అద‌ర‌గొడుతున్న సౌత్ బ్యూటీ
X

కెరీర్ ప్రారంభించిన కేవ‌లం ఐదేళ్ల‌లో పెద్ద స్టార్ గా ఎదిగింది ర‌ష్మిక మంద‌న్న‌. నేడు హిందీలో 3-4 కోట్ల పారితోషికం అందుకుంటున్న క‌థానాయిక‌గా పాపుల‌రైంది. పుష్ప గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత ర‌ష్మిక‌కు హిందీలో వ‌రుస‌గా అవ‌కాశాలొచ్చాయి. కానీ తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. ఇంత‌లోనే యానిమ‌ల్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం ద‌క్కింది. ఇది మ‌ళ్లీ ర‌ష్మిక కెరీర్ గ్రాఫ్ ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది.


బ‌న్నితో పుష్ప 2 ... విక్కీ కౌశ‌ల్ తో చావా ... స‌ల్మాన్ ఖాన్ తో సికంద‌ర్.. ఇవ‌న్నీ ర‌ష్మిక మంద‌న న‌టిస్తున్న సినిమాలు. వీటితో పాటు ఇప్పుడు ట్యాలెంటెడ్ యువ‌హీరో ఆయుష్మాన్ ఖురానాతో 'వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్' లో ర‌ష్మిక అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ చిత్రం మాడాక్స్ ఫిలింస్ లో తెర‌కెక్కుతుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ బ్యాన‌ర్ నుంచి హారర్ కామెడీ విశ్వంలో ముంజ్యా, స్ట్రీ 3, భేదియా 2, విజయ్ నగర్ వాంపైర్ వంటి చిత్రాలు తెర‌కెతున్నాయి. ఇదే బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన స్త్రీ, స్ట్రీ 2 సంచ‌ల‌న‌ విజయాలు ఈ హార‌ర్ జానర్ సిరీస్‌పై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. హార‌ర్ కామెడీ విశ్వంలో ఎదురే లేని బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన సంస్థ‌గా మ‌డాక్స్ పేరు మార్మోగుతోంది. ఇటీవ‌ల స్త్రీ 2 దాదాపు 560కోట్లు వ‌సూలు చేయడం ఒక చ‌రిత్ర‌. ఈ ఏడాది క‌ల్కి 2989 ఏడి త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సంచ‌ల‌న చిత్రంగా శ్రద్ధాక‌పూర్ స్త్రీ2 రికార్డుల‌కెక్కింది. ఇది చాలా సినిమాల బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాయడంతో ఇప్పుడు మ‌డాక్స్ ఫిలింస్ సినిమాల‌కు మార్కెట్లో అద్బుత‌మైన గిరాకీ ఏర్ప‌డింది.

ఈ బ్యాన‌ర్ నుంచి ఇక‌పై ఏ సినిమా విడుద‌ల‌వుతున్నా మార్కెట్లో భారీ బ‌జ్ ఉంటుంది. హార‌ర్ జాన‌ర్ సినిమాలకు మ‌రింత‌ క్యూరియాసిటీ ఉంటుంది. ప్ర‌స్తుతం ఆయుష్మాన్- ర‌ష్మిక మంద‌న్న‌ల 'వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్' ఒక కొత్త జాన‌ర్ సినిమా. స్క్రిప్టు రెడీ అవుతోంది. న‌వంబ‌ర్ లో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. మ‌డాక్స్ బ్యాన‌ర్ లో ఆఫ‌ర్ అంటే ర‌ష్మిక‌కు అది ల‌క్ క‌లిసి రావ‌డ‌మే. త‌న కెరీర్ లో ఒక కొత్త జాన‌ర్ లో ప్ర‌వేశిస్తూ కూడా ర‌ష్మిక అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే వీలుంది. తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్న ర‌ష్మిక మంద‌న్న‌ బాలీవుడ్ లో ప్ర‌వేశించిన చాలా మంది సౌత్ హీరోయిన్స్ తో పోలిస్తే ఒక మెట్టు పైనే ఉంది.