Begin typing your search above and press return to search.

పుష్ప లాంటి వాళ్ళు బయట ఉంటారు : రష్మిక

ఆ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ... హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే అతడి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుంది, హీరోయిన్‌ కోసం కథ రాస్తే హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.

By:  Tupaki Desk   |   15 Dec 2024 4:15 AM GMT
పుష్ప లాంటి వాళ్ళు బయట ఉంటారు : రష్మిక
X

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్‌ను రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. లాంగ్‌ రన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేయాల్సి ఉంది. ఈ వీకెండ్‌లో పుష్ప 2 కి నమోదు అవుతున్న వసూళ్లపై అందరి దృష్టి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పుష్ప 2 సినిమా సాధించిన వసూళ్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ సమయంలో హీరోయిన్‌ రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ... హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే అతడి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుంది, హీరోయిన్‌ కోసం కథ రాస్తే హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. పాత్రల స్వభావం అనేది కథను బట్టి ఉంటుంది. మనుషులు అందరిలోనూ మంచి, చెడు ఉంటాయి. ఆయా సమయాల్లో, సందర్భాల్లో మంచి, చెడు బయటకు వస్తూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం అనేది వారి ఈగోలు ప్రదర్శించే దాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా మంచి, చెడు అంటూ ఉండరు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్ర స్వభావాన్ని కాకుండా కుటుంబం కోసం అతడు చేసిన మంచిని చూస్తే బాగుంటుంది. కుటుంబం కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అలాంటి వారు నిజ జీవితంలోనూ ఉంటారు. అలాంటి వారిని ప్రేరణగా తీసుకుని పుష్ప సినిమాను రూపొందించారు అన్నట్లుగా రష్మిక మందన్న చెప్పుకొచ్చారు. తన అనుకున్న వారి కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధపడే వ్యక్తిగా పుష్పరాజ్‌ను చూపించారు. నిజ జీవితంలో మరో పద్దతిలో అయినా తన కుటుంబం కోసం చాలా దూరం వెళ్లి ఎంతటి వారిని అయినా ఎదిరించేందుకు సిద్ధంగా ఉండే వారు ఉన్నారు అంది.

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న త్వరలో గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఆ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్ కోసం విజయ్ దేవరకొండ వాయిస్‌ ఓవర్‌ సైతం ఇవ్వడం జరిగింది. సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.