IMDb మోస్ట్ అవైటెడ్ సినిమాలు.. రష్మిక డామినేషన్..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'యానిమల్', 'పుష్ప 2: ది రూల్' వంటి పాన్ ఇండియా విజయాలతో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా మారిపోయింది.
By: Tupaki Desk | 18 Jan 2025 5:30 PM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న 'యానిమల్', 'పుష్ప 2: ది రూల్' వంటి పాన్ ఇండియా విజయాలతో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా మారిపోయింది. తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ, ఆచితూచి ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, వరుస షూటింగులతో అమ్మడు తీరిక లేకుండా గడుపుతోంది. ఈ ఏడాదిలో పలు క్రేజీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు IMDb లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది.
2025లో సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాను 'ఇంటర్నెట్ మూవీ డేటాబేస్'(IMDb) సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన 'సికందర్', 'ఛావా', 'థమా' వంటి సినిమాలు ఉండటం విశేషం. టాప్-20 మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్టులో ఆమె నటించిన మూడు సినిమాలకు చోటు దక్కడంతో, అభిమానులు రష్మికను 'ఫీమేల్ స్టార్ ఆఫ్ ది ఇయర్'గా పేర్కొంటున్నారు.
IMDb లిస్ట్ లో అందరూ ఎదురు చూస్తున్న సినిమాగా 'సికందర్' టాప్ ప్లేస్ లో నిలిచింది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించారు. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈద్ స్పెషల్ గా మార్చి నెలాఖరున ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా కలిసి నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఛావా' ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఛత్రపతి శివాజీ కుమారుడు, మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. జనవరి 22న ట్రైలర్ రాబోతోంది.
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్న హారర్-కామెడీ మూవీ 'థమా' అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీస్ లిస్టులో 17వ ప్లేస్ లో ఉంది. 'ముంజ్యా', 'స్త్రీ 2' క్రియేటర్స్, మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.
ఇవి కాకుండా రష్మీక మంధన్న నటిస్తున్న శేఖర్ కమ్ముల 'కుబేర'.. గీతా ఆర్ట్స్ 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలు కూడా 2025లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీటిల్లో కొన్ని హిట్టయినా ఇండస్ట్రీలో అమ్మడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే. ఇకపోతే IMDb లిస్టులో 'టాక్సిక్' మూవీ సెకండ్ పొజిషన్ లో నిలిచింది. కూలీ(3), ది రాజాసాబ్(6), లూసిఫర్-2(8), కన్నప్ప(11), రెట్రో (12), థగ్ లైఫ్(13), కాంతారా: చాప్టర్-1(18), తండేల్(20) వంటి సౌత్ సినిమాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. అంటే 20 మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో 9 దక్షిణాది సినిమాలు ఉన్నాయి.