రష్మిక వీడియోని షేర్ చేసి మోదీ ఏమన్నారంటే?
ఈ దశాబ్ధ కాలంలో భారతదేశాన్ని మోదీ ప్రభుత్వం గొప్పగా అభివృద్ధి చేసిందని రష్మిక ప్రశంసించింది.
By: Tupaki Desk | 17 May 2024 6:06 AM GMTసినీతారలు రాజకీయాల్లోకి వెళుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పలువురు తారలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అదంతా అటుంచితే ఎన్నికలు, రాజకీయారంగేట్రంతో సంబంధం లేకుండానే, పార్టీ టిక్కెట్టు ఆశించకుండానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న మోదీజీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. ఈ దశాబ్ధ కాలంలో భారతదేశాన్ని మోదీ ప్రభుత్వం గొప్పగా అభివృద్ధి చేసిందని రష్మిక ప్రశంసించింది.
ఇటీవలే కొత్తగా ప్రారంభమైన `అటల్ సేతు` వంతెనను రష్మిక ప్రశంసించింది. ముంబైలో రవాణా విషయంలో ఈ వంతెన గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించింది. 22 కిలోమీటర్ల పొడవైన వంతెన భారతదేశంలో పొడవైన సముద్ర లింక్ ని కలిగి ఉంది. ముంబైని దాని పొరుగు నగరమైన నవీ ముంబైకి కలుపుతుంది. జాతీయ మీడియాతో మాట్లాడిన రష్మిక మందన్న ఈ వంతెన ప్రయాణ సమయాన్ని ఏ స్థాయిలో తగ్గిస్తుందనే దాని గురించి మాట్లాడింది. గతంలో రెండు గంటల ప్రయాణం చేయాల్సి వస్తే.. ఇప్పుడు ఆ సమయాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గించడంలో వంతెన సాయపడిందని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నాలను రష్మిక మరింతగా మెచ్చుకున్నారు. ప్రతిదీ చాలా అద్భుతంగా మార్చారని కితాబిచ్చింది. అటల్ సేతు వంతెనను ఈ ఏడాది జనవరిలో ప్రజలకు ప్రారంభించారు. ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఇది విజయవంతమైంది. దీనిపై ప్రజలు విస్తృతంగా ప్రశంసలు కురిపించారు.
నవీ ముంబై నుండి ముంబై వరకు .. గోవా నుండి ముంబై వరకు.. బెంగళూరు నుండి ముంబై వరకు అన్ని ప్రయాణాలు చాలా సులభంగా మార్చింది ప్రభుత్వం. అద్భుతమైన మౌలిక సదుపాయాలను అందించినందుకు నాకు గర్వంగా ఉంది అని రష్మిక అన్నారు.
భారతదేశం ఎక్కడా ఆగడం లేదు. భారతదేశంలో ఇది సాధ్యం కాదు అని ఎవరూ అనలేరు. మన దేశాన్ని చూడండి. అద్భుతంగా ఉంది.. గత 10 సంవత్సరాలలో మన దేశం ఎంతో ఎదిగింది. మౌలిక సదుపాయాలు అమాంతం పెరిగాయి. మన దేశంలోని ప్రణాళికలు బావున్నాయి.. అని రష్మిక అన్నారు. యువ భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. భారతదేశం ప్రస్తుతం తెలివైన దేశం.. నేను దీనికి గర్విస్తున్నాను. ఇప్పుడు మన అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ఓటు వేయాలి! అని అన్నారు.
అటల్ సేతు గురించి రష్మిక మందన్న మాట్లాడుతున్న మరో వీడియోను కూడా ప్రధాని మోదీ షేర్ చేసారు. కచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం.. జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు అని కూడా వ్యాఖ్యను జోడించారు.