Begin typing your search above and press return to search.

రష్మిక... భలే చిక్కుల్లో పడిందే!

నేషనల్‌ క్రష్ పెద్ద చిక్కుల్లో పడింది. ఆమె నటిస్తున్న సినిమాలు రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2024 9:39 AM GMT
రష్మిక... భలే చిక్కుల్లో పడిందే!
X

నేషనల్‌ క్రష్ పెద్ద చిక్కుల్లో పడింది. ఆమె నటిస్తున్న సినిమాలు రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకుని పలు విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు హీరోయిన్స్ సినిమాలు ఒకే రోజు రెండు మూడు రావడం జరిగింది. కానీ ఇప్పుడు హీరోలు ఎలాగైతే చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారో అలాగే హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నారు. వరుసగా సినిమాలు చేయక పోవడం వల్ల ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే వస్తున్నాయి.

రష్మిక మాత్రం ఇతర హీరోయిన్స్ తో పోల్చితే చాలా స్పీడ్‌ గా సినిమాలు చేస్తోంది. గత ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్స్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు రష్మిక మందన్న పుష్ప 2 తో పాటు పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా ఈమె చేస్తున్న రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు హిందీ సినిమా ఛావా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పుష్ప 2 సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో విడుదల వాయిదా వేశారు.

పుష్ప 2 సినిమాను డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు రష్మిక ఫ్యాన్స్‌ పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ 6న పుష్ప 2 ను విడుదల చేయబోతున్నారు. అదే రోజు బాలీవుడ్‌ మూవీ ఛావా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఒకే రోజు రష్మిక మందన్న నటించిన పుష్ప 2 మరియు ఛావా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం అరుదైన విషయంగా ఆమె ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్‌ విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. యానిమల్ సినిమా తర్వాత రష్మిక నటించిన హిందీ సినిమా ఇదే అవ్వడం తో అక్కడ మంచి అంచనాలు ఉన్నాయి. పైగా విక్కీ కౌశల్‌ ఈ మధ్య కాలంలో మినిమం గ్యారెంటీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఛావ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం అనేది రష్మిక కి కాస్త ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి, రెండు హిట్‌ అయితే రష్మిక ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా ఖాయం.