RSS పై సిరీస్.. మోదీ- భాజపాకు కలిసొస్తుందా?
గత ఎన్నికలకు ముందు విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం ఏమైందో తెలిసిందే. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ లు కూడా విడుదలయ్యాయి
By: Tupaki Desk | 26 Oct 2023 11:19 AM GMTగత ఎన్నికలకు ముందు విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం ఏమైందో తెలిసిందే. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ లు కూడా విడుదలయ్యాయి. ఒకటికి మించి మోదీ భజనతో సినిమాలొచ్చాయి. అయితే ఈ సినిమాల వల్ల ఆయా పార్టీలు ఆశించిన లక్ష్యాలను సాధించాయా? రాజకీయ పార్టీల విజయాలకు రిలేటెడ్ సినిమాలు సహకరించాయా? అంటే .. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేలింది. అసలు రాజకీయాలను, ఓటర్లను సినిమాలు ప్రభావితం చేస్తాయి అనుకుంటే మూర్ఖత్వం అని రుజువైంది. ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు దేశం పార్టీకి ఏవిధంగాను ఉపయుక్తం కాలేదు. అలాగే మోదీ గురించి సినిమా తీసినా పట్టించుకునే నాధుడే లేరు.
అయితే ఇప్పుడు కూడా మరోసారి అలాంటి సన్నివేశం కనిపిస్తోంది. త్వరలో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి గనుక ఇప్పుడు నరేంద్ర మోదీకి, భాజపాకు సపోర్టుగా నిలిచే సినిమా ఒకటి విడుదలకు రెడీ అవుతోంది. వన్ నేషన్ అనేది సినిమా టైటిల్. ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలు ఈ సినిమా కోసం పని చేస్తుండడం ఉత్కంఠ కలిగిస్తోంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఈ ధారావాహికకు వన్ నేషన్ లేదా ఏక్ రాష్ట్ర (హిందీలో) అనే పేరును నిర్ణయించారు. వన్ నేషన్ అనేది RSS 100 సంవత్సరాల చరిత్రను చెప్పే సిరీస్. వివేక్ అగ్నిహోత్రి, ప్రియదర్శన్, డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది, జాన్ మాథ్యూ మథన్, మంజు బోరా, సంజయ్ పురాణ్ సింగ్ వంటి ఆరుగురు జాతీయ అవార్డు విజేతలైన దర్శకులు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు.
ఒక్కో దర్శకుడు ఒక్కో విభిన్న కథపై పని చేస్తారు. RSS ఆధారంగా కథలు రాస్తారు. ఇటీవల ఈ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ రిలీజ్ చేసారు. ట్విట్టర్ లో ఆయన వివరాల్ని అందించారు. అంతకుముందు కూడా దీనిపై హింట్ ఉంది. ఈ ఏడాది జనవరిలో వివేక్ అగ్నిహోత్రి ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా తీస్తామని వెల్లడైంది.. ఆ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇప్పటివరకు, విడుదల తేదీని కూడా మేకర్స్ ధృవీకరించలేదు.
RSS అనేది భారతీయ మితవాద హిందూవాదులతో కూడిన జాతీయవాద స్వచ్చంద పారామిలిటరీ సంస్థ. సమాజాన్ని బలోపేతం చేయడానికి హిందూ మతం భావజాలాన్ని వ్యాప్తి చేయడం వారి లక్ష్యం. RSS భారతీయ సంస్కృతిని దాని నాగరికత విలువలను దేశ పౌరులలో నిలబెట్టే ఆదర్శాన్ని ప్రోత్సహిస్తుంది. క్యారెక్టర్ ట్రైనింగ్ అందించి ప్రజల్లో క్రమశిక్షణ పెంపొందించడం కూడా దీని లక్ష్యం. వారు దేశంలో దాదాపు 98 సంవత్సరాలుగా చురుకుగా ఉన్నారు. అన్ని వయసుల వారు దీనిలో పని చేస్తున్నారు.