దేవి 'కంగువా' దెబ్బ.. ఆస్కార్ విజేత అలా అనేసరికి..
ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్, మలయాళీ టెక్నీషియన్ రసూల్ పోకుట్టి ‘కంగువా’ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ పై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు.
By: Tupaki Desk | 15 Nov 2024 7:27 AM GMTసూర్య హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’ కి మొదటిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ కథ, కథనం మాత్రమే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మూవీ క్రిటిక్స్ కూడా ఈ చిత్రంపై పెదవి విరిచారు. అంచనాలని అందుకోవడంలో ‘కంగువా’ విఫలం అయ్యిందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
రెండు టైం లైన్స్ లో నడిచే ఈ కథని రెండు భాగాలుగా దర్శకుడు చెప్పాలని డిజైన్ చేశారు. ‘కంగువా పార్ట్ 1’ తాజాగా వచ్చింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ‘పుష్ప’ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన బిగ్ పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. సూర్య దగ్గరుండి ఈ సినిమా ప్రమోషన్స్ చేశారు. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కచ్చితంగా కోలీవుడ్ కి ఇది ఫస్ట్ 1000 కోట్ల కలెక్షన్ చిత్రం అవుతుందని అందరూ భావించారు.
అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ పూర్తి విరుద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్స్ చాలా లౌడ్ గా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్, మలయాళీ టెక్నీషియన్ రసూల్ పోకుట్టి ‘కంగువా’ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ పై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. నా స్నేహితుడు, రీ రికార్డింగ్ మిక్సర్ ఒకరు ఈ క్లిప్ నాకు పంపించారు. ఇలాంటి జనాధారణ ఉన్న సినిమాలలో సౌండ్ గురించి రివ్యూలు చూడటం నిరాశ కలిగించింది. మా క్రాఫ్ట్ కళాత్మకత, లౌడ్ నెస్ మధ్య వార్ లో చిక్కుకుందని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.
ఈ విషయంలో ఎవరిని బ్లేమ్ చేయాలి? సౌండ్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తినా… లేదంటే అన్ని లోపాలు సరిచేయడానికి చివరి ప్రయత్నంలో చేసిన మార్పులనా?. దీనిపై గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చింది. లౌడ్ సౌండ్స్ తో సినిమా చూసి తలనొప్పితో బయటకి వెళ్తే ఏ చిత్రం కూడా ఆడియన్స్ ని రిపీట్ గా థియేటర్స్ కి రప్పించలేదు. దీనిపై పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని రసూల్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టారు.
ఈ పోస్ట్ లో ‘కంగువా’ మూవీ లౌడ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటుందని ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ పెట్టిన రివ్యూ ఫోటో ఉంది. రసూల్ పోకుట్టి పోస్ట్ పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది ఆయన వ్యాఖ్యలని సమర్థిస్తున్నారు. ఇక పుష్ప 2 BGM కోసం దేవిని మార్చేసి థమన్ ను రంగంలోకి దించినట్లు ఇటీవల క్లారిటీ వచ్చేసింది. ఈ తరుణంలో కంగువా తో దేవి నిరాశపరచడం హాట్ టాపిక్ గా మారింది.