Begin typing your search above and press return to search.

ర‌త‌న్ టాటా పాత్ర‌లో తొలి ఛాన్స్ ఈయ‌న‌కే

దిగ్గ‌జ పారిశ్రామికవేత్త , టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ ర‌త‌న్ టాటా 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Oct 2024 4:30 PM GMT
ర‌త‌న్ టాటా పాత్ర‌లో తొలి ఛాన్స్ ఈయ‌న‌కే
X

దిగ్గ‌జ పారిశ్రామికవేత్త , టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ ర‌త‌న్ టాటా 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో దీర్ఘకాల అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు. కానీ ప‌రిస్థితి విష‌మించి ఆయ‌న మ‌ర‌ణించారు. రాజ‌లాంచ‌నాల‌తో ర‌త‌న్ జీ అంత్యక్రియ‌లు పూర్త‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు, ప్ర‌జ‌లు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే స‌మ‌యంలో స్ఫూర్తివంత‌మైన విజ‌యాల‌తో భార‌త‌జాతి గ‌ర్వించేలా చేసిన‌ పారిశ్రామిక దిగ్గ‌జం రతన్ టాటాపై బ‌యోపిక్ తెర‌కెక్క‌దా? ఒక‌వేళ ఆయ‌న జీవిత‌క‌థ‌ను సినిమాగా తీస్తే, అందులో టైటిల్ పాత్ర‌లో న‌టించే స్టార్ ఎవ‌రు? అంటూ సోష‌ల్ మీడియాల్లో చ‌ర్చ మొద‌లైంది.


అయితే ర‌త‌న్ టాటాపై సినిమా తీసేందుకు ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు దీనిపై చాలా ఆస‌క్తిగా ఉన్నారు. అయితే ఇప్ప‌టికే వెండితెర‌పై ర‌త‌న్ టాటా పాత్రను చిత్రీక‌రించారు. ఈ సినిమాలో నటించే అవకాశం పొందిన ఏకైక నటుడు బొమన్ ఇరానీ అనే విష‌యం చాలా మందికి తెలీదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్రతో కూడిన డ్రామా చిత్రం `మోదీ` 24 మే 2019న ప్రదర్శిత‌మైంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సందీప్ సింగ్ -సురేష్ ఒబెరాయ్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో వివేక్ ఆనంద్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. మోదీ బ‌యోపిక్ చిత్రంలో రతన్ టాటాగా బొమ‌న్ ఇరానీ నటించారు. అతడు ఇంతకుముందు టాటాతో తన పోలిక గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అలాంటి పాత్రలో న‌టించాల‌ని చాలా కాలంగా అనుకుంటున్నాన‌ని బొమ‌న్ అన్నారు.


ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ర‌త‌న్ జీ పాత్ర కోసం బొమ‌న్ ఇరానీని సంప్రదించినప్పుడు అతడు రెండో ఆలోచ‌నే లేకుండా వెంటనే అంగీకరించాడు. టీమ్ అంకితభావాన్ని ప్రశంసిస్తూ, ఒమంగ్ అద్భుతమైన పని చేసాడని బోమన్ పేర్కొన్నాడు. అతడి సన్నివేశాలను అహ్మదాబాద్‌లో చిత్రీకరించార‌ని తెలిపాడు.

పారిశ్రామిక దిగ్గ‌జం ర‌త‌న్ టాటా మ‌ర‌ణంపై సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. అమితాబ్, ఖాన్ ల త్ర‌యం స‌హా ప్రియాంక చోప్రా, అలియా భట్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శ్రద్ధా కపూర్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్ రావు వంటి ప్రముఖులు సోషల్ మీడియాల్లో రతన్ టాటా మరణం పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. అతడు సమాజంపై చూపిన ప్రభావం గురించి వారంతా ప్ర‌స్థావించారు.