ఇండస్ట్రీ పరువు తీశారు.. 'రేసుగుర్రం' నటుడి ఆవేదన
తాను భోజ్‌పురి సినిమాలో మూడవ దశ ప్రారంభించానని.. తన జూనియర్‌లకు వేదికను ఏర్పాటు చేశానని, కానీ వారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని రవి పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 26 Nov 2024 5:30 PM GMT'రేసు గుర్రం' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు రవికిషన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నువ్వా? నేనా? అంటూ పోటీపడి నటించిన అతడికి తెలుగు వారిలోను అభిమానులున్నారు. అతడికి భోజ్ పురి రాజకీయాల్లోను అనుభవం ఉంది. నటుడు- రాజకీయ నాయకుడు రవికిషన్ భోజ్‌పురి చలనచిత్ర పరిశ్రమ అభ్యున్నతికి తనవంతుగా పెద్ద సహకారం అందించిన వారిలో ముందు వరుసలో ఉన్నారు. కానీ అతడు ఓ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. కొత్త తరం నటులు భోజ్‌పురి చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నాశనం చేసారని భావిస్తున్నట్టు తెలిపాడు. దిల్లీలోని సాహిత్య ఆజ్‌తక్‌లో జరిగిన సమావేశంలో రవికిషన్ మాట్లాడుతూ.. పరిశ్రమ అభివృద్ధిలో తాను ఎలా భాగమయ్యాడో వివరించడమే గాక, కోల్పోయిన ప్రతిష్ఠ గురించి అసహనం వ్యక్తం చేశాడు. తాను భోజ్‌పురి సినిమాలో మూడవ దశ ప్రారంభించానని.. తన జూనియర్‌లకు వేదికను ఏర్పాటు చేశానని, కానీ వారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని రవి పేర్కొన్నాడు.
దురదృష్టవశాత్తూ నా జూనియర్స్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాను. వారు భోజ్‌పురి సినిమా ప్రతిష్టను చెడగొట్టారు. భోజ్‌పురి 25 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష.. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను కూడా పరిశ్రమ కోసం ఎంతో కొంత అందించాను.. అని అన్నారు. ``భోజ్‌పురి సినిమా చాలా మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోందని, అయినప్పటికీ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందారు. భోజ్‌పురి సినిమా మూడవ దశకు నాంది పలికిన వ్యక్తిని నేను.. ఈ రోజు ఇండస్ట్రీలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. నా కంటే జూనియర్ నటులు బొంబాయికి వెళ్ళే సమయానికి, నేను ఇప్పటికే వారికి వేదికను సిద్ధం చేసాను`` అని అన్నారు.
తాను నటుడవుతానంటే తన తండ్రి తిట్టారని కూడా గుర్తు చేసుకున్నాడు. నటుడిగా మారడానికి తాను చేసిన పోరాటం గురించి కూడా చెప్పాడు. రవి సినీ పరిశ్రమలోకి ప్రవేశించడాన్ని తన తండ్రి ఎలా వ్యతిరేకించారో వెల్లడించాడు. సినిమాల్లో కెరీర్ ఎంపిక సరికాదని తన తండ్రిగారు తిట్టాడు. నేను పూజారి కొడుకుని.. నాకు మా నాన్న నేర్పిన ఆధ్యాత్మికత, నిజాయితీ మాత్రమే కాదు. నేను థియేటర్‌లో ఉండేవాడిని.. నేను చిన్నతనంలో రామ్ లీలాలో సీతాజీగా నటించాను. నాన్న నన్ను కొట్టారు. మా నాన్నగారు `నాచనియా బాంబే` అని తిట్టేవారు. దీనర్థం బాంబేలో నువ్వు నర్తకి అవుతావు అని. ఎందుకంటే 80 - 90లలో బ్రాహ్మణుడిగా ఆయన అర్థం చేసుకోలేకపోయారు.. అని అన్నారు.
రవికిషన్ దాదాపు రెండు దశాబ్ధాల క్రితం భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బుల్లితెరపైనా రాణించి, సౌత్, హిందీ సహా అనేక పరిశ్రమలలో నటుడిగా పనిచేశాడు. కిరణ్ రావు `లాపాటా లేడీస్`లో అతడు నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ రేసులో పోటీపడుతోంది. ఇందులో అతడు ఒక గ్రామంలో అవినీతిపరుడైన పోలీసు పాత్రను పోషించాడు.