లడ్డూ వ్యవహారం.. రేసుగుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
By: Tupaki Desk | 24 Sep 2024 9:17 AM GMTతిరుమల లడ్డూ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని సీఎం చంద్రబాబు ఆరోపించిన తర్వాత.. పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ల్యాబ్ రిపోర్ట్ ను కూడా చంద్రబాబు సమర్పించగా.. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆరాతీసింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అలా లడ్డూ వ్యవహారం పీక్స్ కు చేరింది. నేషనల్ వైడ్ గా అనేక మంది నాయకులు స్పందిస్తున్నారు.
ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ ఎంపీ, నటుడు రవి కిషన్ శుక్లా.. లడ్డూ వ్యవహారంపై రెస్పాండ్ అయ్యారు. గతంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)ని నడిపిన వారు హిందువులు కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు హిందువులకు గొడ్డు మాంసం లడ్డూలు ఇచ్చారని ఆరోపించారు. శాస్త్రాలతో పాటు శస్త్రాలు అంటే ఆయుధాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అందుకు పోరాడేందుకు సాధువులు.. యోధులుగా మారాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయని రవి కిషన్ తెలిపారు.
గోరఖ్ పూర్ లోని ప్రముఖ గోరఖ్ నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్ధంతి వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న రవికిషన్.. ఆ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గోరఖ్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి పలుమార్లు రవికిషన్ గెలుపొందిన విషయం తెలిసిందే. పలు టాలీవుడ్ సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. విలన్ రోల్స్ లో తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు. అల్లు అర్జున్ రేసు గుర్రం మూవీతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ కొన్ని రోజుల క్రితం తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్రంగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు రాబట్టేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల సిట్ ను ఏర్పాటు చేసింది. సమగ్ర నివేదికను త్వరలోనే సిట్ అందించనుంది. అందుకు కోసం దర్యాప్తు చేస్తోంది.
ఇక.. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని నివేదికలో ఉన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం నాడు శాస్త్రోక్తంగా శాంతి హోమం నిర్వహించింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ఆనంద నిలయంతో పాటు నాలుగు తిరుమాడ వీధుల్లో పూజా సంప్రోక్షణ నిర్వహించింది. మరి లడ్డూ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో.. సిట్ తమ నివేదికలో ఏం చెబుతుందో వేచి చూడాలి.