మైత్రీ రవి చేసిన చిలిపి దొంగతనం ఏంటంటే..
రిలీజ్ దగ్గర పడుతున్నందున చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసింది. అందులో భాగంగానే మంగళవారం మీడియా ముందుకొచ్చింది చిత్ర బృందం.
By: Tupaki Desk | 12 March 2025 11:35 AM ISTమార్చి 28న రిలీజ్ కానున్న రాబిన్‌హుడ్ సినిమా విజయంపై చిత్ర యూనిట్ మొత్తం ఎంతో నమ్మకంగా ఉంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిని ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అవడంతో రాబిన్‌హుడ్ పై మంచి అంచనాలేర్పడ్డాయి.
దానికి తోడు టీజర్, పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. రిలీజ్ దగ్గర పడుతున్నందున చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసింది. అందులో భాగంగానే మంగళవారం మీడియా ముందుకొచ్చింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా మైత్రీ నిర్మాత రవి శంకర్ రాబిన్‌హుడ్ పై చాలా నమ్మకాన్ని వెల్లబుచ్చారు. ఆల్రెడీ రాబిన్‌హుడ్ సినిమా చూశానని, తనకు సినిమా చాలా నచ్చిందని, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయని, రాబిన్‌హుడ్ ఓ పవర్ ప్యాక్డ్ మూవీ అని ఆయన అన్నారు.
ఈ ఈవెంట్ లో తాము చేసిన దొంగతనాల గురించి యాంకర్ చిత్ర టీమ్ ను అడిగి సరదాగా నవ్వించింది. నిర్మాత రవిని ఆయన చిన్నతనంలో చేసిన దొంగతనం గురించి యాంకర్ అడగ్గా ఆయన దానికి సమాధానమిచ్చారు. చిన్నప్పుడు ఇంట్లో కనిపించడం ఆలస్యం అవి మాయమైపోయేవని, కానీ ఇప్పుడు తన కొడుకు రూ. 1000 తీసుకెళ్తే రూ.300 ఖర్చు చేసి తిరిగి రూ.700 వెనక్కి ఇవ్వడం చూస్తుంటే ఈ వయసులో డబ్బులు వెనక్కి ఇస్తుంటే ఇక నువ్వేం బాగు పడతావురా అనిపిస్తుందని సరదాగా చెప్పారు రవి.
మీరు చాలా తెలివైన నిర్మాత. అందుకే చిన్నప్పట్నుంచే డబ్బులు పట్టేసుకున్నారని యాంకర్ అన్నదానికి తాను డబ్బులు పట్టుకోలేదని, తస్కరించానని తమ బ్యానర్ లో తెరకెక్కిన మత్తు వదలరా మూవీలోని డైలాగ్‌ను చెప్పారాయన.