పుష్ప 2 స్క్రీన్స్.. ఆ యాప్ ద్వారా నచ్చిన భాషలో మూవీ..
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్క్రీన్ల నెంబర్ ను రివీల్ చేశారు రవిశంకర్.
By: Tupaki Desk | 29 Nov 2024 12:06 PM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2: ది రూల్ మరో ఐదు రోజుల తర్వాత రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కనీవినీ ఎరుగని స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
అయితే మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా.. సీక్వెల్ అంతకు మించి హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో పుష్ప-2ను వరల్డ్ వైడ్ గా పది వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో టాక్ వస్తోంది.
11 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని రీసెంట్ గా గుసగుసలు వినిపించాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. తాజాగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా 12000 స్క్రీన్లలో డిసెంబర్ 5వ తేదీన పుష్ప-2ను రిలీజ్ చేస్తున్నట్లు సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఎర్నేని శుక్రవారం వెల్లడించారు.
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్క్రీన్ల నెంబర్ ను రివీల్ చేశారు రవిశంకర్. దాంతోపాటు మరో అదిరిపోయే విషయాన్ని తెలిపారు. ఆరు భాషల్లో విడుదల కానున్న పుష్పను సినీ డబ్స్ యాప్ ద్వారా ఎవరికి నచ్చిన భాషలోనైనా ఈజీగా చూడవచ్చని చెప్పారు.
దీంతో ఇప్పుడు సినీ డబ్స్ యాప్ కోసం తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో ట్రై చేస్తున్నారు అనేక మంది నెటిజన్లు. అయితే సినీ డబ్స్ యాప్ ప్లే స్టోర్ లో ఇప్పటికే అందుబాటులో ఉంది. దానిని ఇన్ స్టాల్ చేసుకుని అందులో అవైలబుల్ ఉన్న మూవీ లిస్ట్ ను బ్రౌజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పుష్పను సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మీరు వెళ్లే థియేటర్ పేరును, షో టైమ్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకుంటే.. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ డౌన్లోడ్ అయిపోతుంది. థియేటర్లలోకి వెళ్లాక ప్లే బటన్ క్లిక్ చేస్తే చాలు.. మూవీ సౌండ్ ట్రాక్ ను హెడ్ ఫోన్స్ ద్వారా వినవచ్చు. ఎంచక్కా సింకింగ్ తో స్క్రీన్ పై సినిమా కూడా చూడవచ్చు.