యంగ్ హీరో చేతి నుంచి సీనియర్ హీరో చేతికి వెళ్లిన 'బందూక్'
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రవితేజు దృష్టిలో పెట్టుకుని రెడీ చేసిన బందూక్ అనే కథ కొన్ని కారణాల వల్ల విశ్వక్ సేన్ వద్దకు వెళ్లింది.
By: Tupaki Desk | 28 Jan 2025 1:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో వద్దకు వెళ్లడం, ఒక హీరో చేయాలి అనుకున్న సినిమాను మరో హీరో చేయాలి అనుకోవడం, ఒక హీరో నో చెప్పిన కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం అనేది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ నో చెప్పిన మూడు నాలుగు కథలను రవితేజ చేసి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఏ కథ ఎవరి వద్ద నుంచి వచ్చింది, ఎవరి కోసం రెడీ చేశారు అనే విషయాలు చాలా అరుదుగా ముందస్తుగా తెలుస్తూ ఉంటుంది. తాజాగా ఒక కథ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రవితేజు దృష్టిలో పెట్టుకుని రెడీ చేసిన బందూక్ అనే కథ కొన్ని కారణాల వల్ల విశ్వక్ సేన్ వద్దకు వెళ్లింది. సుధాకర్ చెరుకూరి నిర్మించాలని భావించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయించారు. కానీ కొన్ని కారణాల వల్ల విశ్వక్ సేన్ ఆ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రెండు రోజుల క్రితమే బందూక్ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. బందూక్ ను వదలకుండా దర్శక నిర్మాతలు మరో హీరో చేతిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాస్త తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను చేయాలని నిర్మాత భావిస్తున్నారట. అందుకే ఒకరు ఇద్దరు మీడియం రేంజ్ హీరోల వద్దకు తీసుకు వెళ్లారు.
చివరకు ఈ కథ ఏ హీరో కోసం అయితే రెడీ చేశారో ఆ హీరో వద్దకే వెళ్లిందట. రవితేజ పారితోషికం సినిమా బడ్జెట్‌కి వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో మొదట విశ్వక్ సేన్‌ను సంప్రదించిన మేకర్స్ ఇప్పుడు మళ్లీ మాస్ రాజా వద్దకు వెళ్లారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ సైతం ఇప్పటికీ ఆ బందూక్ ని భుజాన పెట్టుకునేందుకు సిద్ధం అన్నారట. అయితే నిర్మాత బడ్జెట్ విషయంలో ఆలోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే రవితేజతో బందూక్ సినిమాను చేయబోతున్నట్లు స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
రవితేజ ప్రస్తుతం 'మాస్ జారత' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా నిరాశ పరచడంతో పాటు అంతకు ముందు గత రెండేళ్లుగా సరైన హిట్ పడక పోవడంతో రవితేజ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బందూక్ సినిమాను రవితేజ ఒప్పుకోవడం చూస్తూ ఉంటే ఆ కథకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది.
రవితేజ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం పడుతుంది. కనుక ఒకవేళ రవితేజ బందూక్ కన్ఫర్మ్ అయితే ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై రవితేజ వైపు లేదా నిర్మాత వైపు నుంచి చిన్న ప్రకటన సైతం రాలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.