Begin typing your search above and press return to search.

మాస్ రాజా ఏంటి ఈ పరిస్థితి..?

మాస్ మహరాజ్ రవితేజకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 6:09 AM GMT
మాస్ రాజా ఏంటి ఈ పరిస్థితి..?
X

మాస్ మహరాజ్ రవితేజకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. 2022 లో ధమాకాతో సూపర్ హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిన రవితేజ ఆ ఉత్సాహంతో చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు, ఈగల్, చివరికి రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ ఇలా వరుస సినిమాలు నిరాశ మిగిల్చాయి. రవితేజ తన రెగ్యులర్ మార్క్ ఎంటర్టైనర్ కాకుండా కాస్త కొత్తగా చేద్దాం అనుకున్న ప్రతిసారి ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. ఐతే మిస్టర్ బచ్చన్ మాత్రం తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాగా వచ్చినా అది కూడా ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు.

వరుసగా నాలుగు ఫ్లాపులు పడిన రవితేజ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రైటర్ గా తన పెన్ పవర్ చూపించిన భాను భోగవరపు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లోనే రవితేజ భుజానికి గాయమైంది. డాక్టర్లు 6 వారాల దాకా రెస్ట్ తీసుకోమని చెప్పడంతో షూటింగ్ కు బ్రేక్ పడ్డది. కొత్త దర్శకులతో రవితేజ చేసిన అన్ని ప్రయత్నాలు రివర్స్ కొట్టాయి. అలా అని హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ని నమ్ముకుంటే అతను కూడా ఫ్లాప్ ఇచ్చాడు.

అందుకే ఇక మీదట కంటెంట్ ని నమ్ముకుని సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు రవితేజ. భాను భోగవరపు డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న సినిమా మాస్ రాజా మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. మరి కథ ఏంటన్నది తెలియదు కానీ రవితేజ మాత్రం కచ్చితంగా ఈ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.

సామజవరగమన సినిమాతో రైటర్ గా సూపర్ హిట్ కొట్టిన భాను ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చూపించనున్నాడు. తప్పకుండా రవితేజ లోని కామెడీ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రవితేజ తిరిగి ఫాం లోకి రావాలని మాస్ రాజా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.