రవితేజ నెక్ట్స్ ఆ డైరెక్టర్‌తోనే!
త్వరలోనే మాస్ జాతర షూటింగ్ పూర్తి కానుంది. అందుకే ఇప్పుడు రవితేజ తన తర్వాతి సినిమా కోసం రైటర్ కం డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 8 Feb 2025 2:30 PM GMTహిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకడు. సంవత్సరానికి ఎంత లేదన్నా రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు రవితేజ. గతేడాది కూడా ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ ఆ రెండు సినిమాలూ డిజాస్టర్లయ్యాయి.
దీంతో ఇక మీదట సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆచితూచి సినిమాలను ఓకే చేస్తున్నాడు రవితేజ. అందుకే సినిమాల స్పీడును కూడా తగ్గించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మాస్ జాతర అనే సినిమా మాత్రమే ఉంది. త్వరలోనే మాస్ జాతర షూటింగ్ పూర్తి కానుంది. అందుకే ఇప్పుడు రవితేజ తన తర్వాతి సినిమా కోసం రైటర్ కం డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఆయన మరెవరో కాదు. రామ్ పోతినేనితో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, సాయి ధరమ్ తేజ్ తో చిత్ర లహరి, శర్వానంద్ తో ఆడవాళ్లూ మీకు జోహార్లు లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల. ఫీల్ గుడ్ సినిమాలు చేసే కిషోర్ తిరుమల ఇప్పటివరకు మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు చేసింది లేదు.
అలాంటి కిషోర్ తిరుమల చేతిలో మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో రవితేజ- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో అనే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రవితేజ తను ప్రస్తుతం నటిస్తున్న మాస్ జాతర సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్లో తెరకెక్కుతున్న 75వ సినిమా కాబట్టి మాస్ జాతరపై చాలా స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాను ముందుగా మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడా డేట్ కు చిరంజీవి విశ్వంభర లైన్ లో ఉందని తెలుసుకుని మాస్ జాతరను పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.