టైగర్ నాగేశ్వరరావు కి ఏపీ హైకోర్టు షాక్..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు.
By: Tupaki Desk | 31 Aug 2023 6:22 AM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, రీసెంట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, దానిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసేసింది.
ఈ మూవీ టీజర్ లో వాడిన ఓ పదం ఓ సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా సువర్ట్ పురం ప్రాంత వాసులను అవమానించేలా ఉందని న్యాయస్థానం భావించింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని కోర్టు ప్రశ్నించింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా? అని సినిమా నిర్మాతలపై కోర్టు సీరియస్ అవ్వడం గమనార్హం. ఇలాంటి టీజర్ ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని న్యాయస్థానం నిలదీసింది.
ఈ మేరకు ఈ సినిమాకు నిర్మతగా వ్యవహరిస్తున్న అభిషేక్ అగర్వాల్ కి న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌పర్సన్ ను కూడా ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. అభ్యంతరాలపై చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజికవర్గ మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్టుపురం గ్రామ ప్రజల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో, న్యాయస్థానం దానిని స్వీకరించి పైవిధంగా స్పందించింది. న్యాయస్థానం దాకా విషయం వెళ్లడంతో, డైలాగుల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, ఈ సినిమాని అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూపర్టపురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. మరి, ఈ సినిమా టీజర్ విషయంలోనే ఇంత రాద్దాంతం జరిగిందంటే, సినిమా విడుదలయ్యాక ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో చూడాలి.