Begin typing your search above and press return to search.

'రాయన్' మూవీ రివ్యూ

నటుడిగా గొప్ప స్థాయిని అందుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్.. దర్శకుడిగానూ ఇప్పటికే ప్రతిభ చాటుకున్నాడు. 'పవర్ పాండి' అనే సినిమా తీసి మెప్పించాడు.

By:  Tupaki Desk   |   26 July 2024 9:17 AM GMT
రాయన్ మూవీ రివ్యూ
X

'రాయన్' మూవీ రివ్యూ

నటీనటులు: ధనుష్-సందీప్ కిషన్-ప్రకాష్ రాజ్-ఎస్.జె.సూర్య-కాళిదాస్ జయరాం-అపర్ణ బాలమురళి-దుషారా విజయన్-వరలక్ష్మి శరత్ కుమార్-సెల్వరాఘవన్-శరవణన్ తదితరులు

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్

ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్

నిర్మాత: కళానిధి మారన్

రచన-దర్శకత్వం: ధనుష్

నటుడిగా గొప్ప స్థాయిని అందుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్.. దర్శకుడిగానూ ఇప్పటికే ప్రతిభ చాటుకున్నాడు. 'పవర్ పాండి' అనే సినిమా తీసి మెప్పించాడు. ఇప్పుడతను తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం.. రాయన్. ఈ రోజే తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రాయన్ (ధనుష్) ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే వ్యక్తి. చిన్నతనంలోనే అతడి చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు తల్లిదండ్రులకు దూరమవుతారు. ఉన్న ఊరిని వదిలేసి మరో టౌన్లో వచ్చి స్థిరపడతారు. అతడి పెద్ద తమ్ముడు ముత్తు (సందీప్ కిషన్) పదే పదే గొడవలకు వెళ్తూ సమస్యలు తెచ్చిపెడుతుంటాడు. రాయన్ కు మాత్రం గొడవలంటే అస్సలు నచ్చదు. ఏ పరిస్థితుల్లో అయినా సంయమనం పాటిస్తూ గొడవలకు దూరంగా ఉండాలని తమ్ముళ్లిద్దరినీ వారిస్తూ ఉంటాడు. ఐతే ఒక రోజు సిటీలో పేరున్న గూండాల్లో ఒకడైన దొరై కొడుకు ఓ గొడవలో భాగంగా హత్యకు గురైతే.. ఆ నేరం ముత్తు మీద పడుతుంది. దాని వల్ల రాయన్ కుటుంబానికి ఆపద వస్తుంది. అప్పుడు రాయన్ తన తమ్ముడిని.. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు.. ఈ క్రమంలో తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. ఇంతకీ తన గతమేంటి.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: దర్శకుడిగా తన తొలి చిత్రం 'పవర్ పాండి'లో ఒక నడివయస్కుడైన వ్యక్తి కథను ఎంతో హృద్యంగా చెప్పి మెప్పించాడు ధనుష్. ఒక స్టార్ హీరో అలాంటి ఫ్యామిలీ టచ్ ఉన్న సున్నితమైన కథతో సినిమా తీసి మెప్పించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దర్శకుడిగా తన రెండో ప్రయత్నంలో అతను రూటు మార్చి ఒక యాక్షన్ కథను ఎంచుకోవడం.. అందులో తనే హీరోగా నటించడంతో అభిమానులు ఎంతో ఊహించుకున్నారు. కానీ ఈసారి కథ కంటే కూడా హీరో ఎలివేషన్ల మీద.. అలాగే టేకింగ్ మీద దృష్టిపెట్టిన ధనుష్.. పూర్తిగా దారి తప్పేశాడు. స్టైలిష్ టేకింగ్ పక్కన పెడితే.. 'రాయన్' ఒక సగటు మాఫియా సినిమా మాత్రమే. ఆరంభంలో కొంచెం ఆసక్తి రేకెత్తించి.. ఆ తర్వాత గాడి తప్పే ఈ చిత్రం.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

హీరో ఒక మామూలు వ్యక్తిలా బతుకుతుంటాడు. అతడికి గొడవలంటే భయం. తన కుటుంబ సభ్యులు గొడవలకు వెళ్తున్నా వారిస్తాడు. అలాంటి వాడు ఒక సిచువేషన్ వచ్చినపుడు ఉగ్ర రూపం దాలుస్తాడు. దీంతో అతడి అసలు నేపథ్యం బయటికి వస్తుంది. సౌత్ ఇండియాలో 'బాషా' దగ్గర్నుంచి మొదలుపెడితే ఈ లైన్లో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కలేదు. 'రాయన్' కూడా ఇదే స్టయిల్లో సాగే సినిమానే. కాకపోతే 'బాషా' స్క్రీన్ ప్లే మరీ రొటీన్ అయిపోయిన నేపథ్యంలో కొంచెం ఆర్డర్ మార్చాడు ధనుష్. ముందు హీరో గతాన్ని.. తన నేపథ్యాన్ని చూపించి.. ఆ తర్వాత వర్తమానంలోకి వచ్చాడు. ఐతే ఆరంభం కొంచెం ఆసక్తికరంగానే అనిపించినా.. తర్వాత ఒక దశా దిశా లేకుండా సాగే కథనమే ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. మరీ ఇల్లాజికల్ గా అనిపించే సీన్లు ప్రేక్షకులకు సినిమా మీద ఇంప్రెషన్ ను అంతకంతకూ తగ్గించేస్తాయి.

హీరో తమ్ముడి మీద ఒక హత్యా నేరం పడుతుంది. చనిపోయిన వ్యక్తి తండ్రి పెద్ద డాన్. అతను హీరోకు ఫోన్ చేసి పొద్దునకల్లా నీ తమ్ముడిని తెచ్చి నాకప్పగించు.. లేదంటే నీ కుటుంబం ఉండదు అంటాడు. అంతే ఆ సిటీనే గుప్పెట్లో పెట్టుకుని ఆ డాన్ దగ్గరికి వెళ్లి తన చుట్టూ ఉన్న పదుల మందితో కలిపి అందరినీ ఏసేస్తాడు హీరో. ఈ ఎపిసోడ్లో ధనుష్ టేకింగ్ అదరహో అనిపిస్తుంది. హీరో ఎలివేషన్ కూడా బాగా పండింది. కానీ టేకింగ్ బాగుంటే.. ఎలివేషన్ పండితే సరిపోతుందా? లాజిక్ అనేది కూడా ముఖ్యం కదా? ఇక్కడ హీరోకేమీ బాషా టైపు ఫ్లాష్ బ్యాక్ ఉండదు. అతనేమీ పూర్వాశ్రమంలో డాన్ కూడా కాదు. అలాంటిది కనీసం అవతలి వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా తన ఇంటికి వెళ్లి అక్కడున్న పదుల సంఖ్యలో రౌడీలతో సహా ఆ డాన్ కుటుంబాన్ని లేపేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇంత చేసిన వాడు.. ఎవరికీ దొరక్కుండా తర్వాత మామూలు జీవనం గడపాలని అనుకోవడంలోనూ ఔచిత్యం కనిపించదు. కథలో మలుపు వచ్చే ఈ ఎపిసోడ్ దగ్గర మొదలుపెడితే.. 'రాయన్'లో తర్వాత అన్నీ ఇల్లాజికల్ గానే కనిపిస్తాయి.

ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్ ఎపిసోడ్లు వస్తుంటాయి. కత్తుల వేట కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా ఎమోషన్ మాత్రం కనిపించదు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందో.. ఎవరితో ఎవరికి ఏం గొడవో అర్థం కాదు. కానీ అంతులేని హింసతో తెర రక్తసిక్తమవుతుంది. హీరో తమ్ముళ్లు తనను చంపేంతగా ఎందుకు తిరుగుతారు అనడానికి సరైన రీజనింగే లేదు. కనీసం మాస్ మెచ్చేలా సినిమాలో హడావుడి అయినా ఉంటే ఒక రకం అనుకోవచ్చు. ధనుష్ టేకింగ్ అంతా కొరియన్ సినిమాల స్టయిల్లో సటిల్ గా సాగుతుంటే.. ఏఆర్ రెహమాన్ అందుకు తగ్గట్లే స్కోర్ ఇచ్చాడు. దీంతో రాను రాను ప్రేక్షకుల్లో నీరసం ఆవహిస్తుంది. చాలా ముందే కథతో డిస్కనెక్ట్ అయిపోయిన ప్రేక్షకులు ఇక సినిమా ఎప్పుడు ముగుస్తుంది.. ఎలా ముగుస్తుంది అని ఎదురు చూడ్డమే మిగులుతుంది. ముగింపు కూడా సాధారణంగా ఉండడంతో 'రాయన్' చివరికి శిరోభారంలా తయారవుతుంది. దర్శకుడిగా ధనుష్ ఈసారి ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాని సినిమానే అందించాడు.

నటీనటులు: రాయన్ పాత్రలో ధనుష్ గెటప్ బాగుంది. తన నటన కూడా ఆకట్టుకుంటుంది. ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్ గా తన పాత్రను చేసుకుపోయాడు ధనుష్. పెర్ఫామెన్స్ పరంగా ధనుష్ కు వంకలు పెట్టడానికేమీ లేదు. కానీ సినిమాలో తన పాత్ర పరిధే తక్కువ అనిపిస్తుంది. అది అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు. సందీప్ కిషన్ హీరో తమ్ముడి పాత్రలో ఆకట్టుకున్నాడు. తన పాత్ర కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఎందుకున్నాడో అర్థం కాదు. మొదట్లో ఈ కథలో కీలక మలుపు ఆయనే అనిపిస్తుంది. కానీ తర్వాత ఆయన సైడైపోయాడు. ఎస్.జె.సూర్య స్పెషల్ టాలెంట్ ను ఈ సినిమాలో పెద్దగా వాడుకోలేదు. తన పాత్ర సిల్లీగా అనిపిస్తుంది. హీరో చెల్లెలిగా దుషారా విజయన్ కీలక పాత్రలో రాణించింది. అపర్ణ బాలమురళి మొదట్లో మెరిసి తర్వాత మాయమైపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ కు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారు. ఆమె ప్రత్యేకత ఏమీ కనిపించలేదు.

సాంకేతిక వర్గం: ఏఆర్ రెహమాన్ సంగీతం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. మ్యూజిక్ బాలేదు అనలేం. కానీ ఒకప్పటి ఏఆర్ స్థాయిలో మాత్రం లేదు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకట్రెండు పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లే సాగింది. కొన్ని చోట్ల స్కోర్ గొప్పగా అనిపిస్తుంది. కానీ సన్నివేశాల్లోని నీరసం వల్ల ఆర్ఆర్ ను అంతగా ఎంజాయ్ చేయలేం. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. సినిమాను చాలా స్టైలిష్ గా తీశాడు. సినిమా అంతటా ఒక మూడ్ కనిపించేలా విజువల్స్ సాగుతాయి. సన్ పిక్చర్స్ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కానీ రైటర్ కమ్ డైరెక్టర్ ధనుషే తీవ్రంగా నిరాశపరిచాడు. అతను ఎంచుకున్న కథలోనే ఏ కొత్తదనం.. విశేషం లేదు. బాగా అరిగిపోయిన ఫార్మాట్ ఇది. టేకింగ్ ద్వారా ఎంత మాయ చేయాలని చూసినా ఫలితం లేకపోయింది.

చివరగా: రాయన్.. ఎమోషన్ లెస్ యాక్షన్

రేటింగ్-2.25/5