RC16 లీక్ ఇచ్చిన రత్నవేల్
శంకర్ మార్క్ ఒక మంచి పొలిటికల్ డ్రామాగా గేమ్ ఛేంజర్ సినిమా రూపొందింది.
By: Tupaki Desk | 25 Dec 2024 7:30 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రికార్డ్ స్థాయిలో అత్యధిక థియేటర్‌లలో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా చరణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. శంకర్ మార్క్ ఒక మంచి పొలిటికల్ డ్రామాగా గేమ్ ఛేంజర్ సినిమా రూపొందింది. సినిమాపై అంచనాలు టీజర్ విడుదల తర్వాత అమాంతం పెరిగాయి. ట్రైలర్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
రామ్ చరణ్ ఒక వైపు గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటూనే మరో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలోనూ సినిమాను చేస్తున్నాడు. చరణ్ తో మూవీ కోసం దాదాపు ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. మొదటి షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతుంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ లీక్ చేశారు. రామ్ చరణ్‌తో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నట్లుగానూ ఆయన పేర్కొన్నారు.
రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. మైసూర్‌లో నైట్ షూట్స్ కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం ఆ షూట్‌లో ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బుచ్చిబాబు, చరణ్ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను రత్నవేల్ ఇవ్వడం ద్వారా అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ గెటప్ చాలా స్పెషల్‌గా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో మూవీ #RC16లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో ఆమె సైతం షూటింగ్‌లో జాయిన్ కాబోతుంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌కి రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం రావడంతో ముందు ముందు మరిన్ని భారీ సినిమాల్లో ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది మొదలుకుని పూర్తి అయ్యే వరకు ఎలాంటి లుక్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.