'జైలర్'ని కోర్టుకీడ్చిన RCB టీమ్.. ఇంతకీ ఏం జరిగింది?
తమను కించపరిచే విధంగా చిత్రీకరించిన దృశ్యాలలో RCB జెర్సీని ఉపయోగించడంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ఐపీఎల్ టీమ్ కోర్టుకు ఫిర్యాదు చేసింది.
By: Tupaki Desk | 28 Aug 2023 2:51 PM GMT'జైలర్' అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద జైలర్ 500కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో సంచలనం సృష్టించింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఊహించనివిధంగా వివాదంలోకి వచ్చింది. ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జెర్సీని షూటర్ ధరించిన దృశ్యాలను మార్చాలని 'జైలర్' చిత్ర నిర్మాతలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సెప్టెంబర్ 1వ తేదీలోగా సన్నివేశాలను మార్చాలి.. లేదా థియేటర్లలో సినిమాని ప్రదర్శించకూడదు. ప్రతివాదులు వారి పంపిణీ నెట్‌వర్క్ సహా అన్ని పార్టీలు కూడా పై నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాలి. 1 సెప్టెంబర్ 2023 తర్వాత ఏ థియేటర్‌లోనూ RCB జెర్సీని ఏ రూపంలోనూ ప్రదర్శించకూడదని కోర్టు స్పష్ఠంగా ఆదేశాలు జారీ చేసింది. టెలివిజన్, శాటిలైట్ లేదా ఏదైనా OTT ప్లాట్‌ఫారమ్ లలో విడుదలకు ముందు మార్పులతో మాత్రమే ప్రసారం చేయాలి అని కోర్టు పేర్కొంది.
తమను కించపరిచే విధంగా చిత్రీకరించిన దృశ్యాలలో RCB జెర్సీని ఉపయోగించడంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ఐపీఎల్ టీమ్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఒక సీన్ లో కాంట్రాక్ట్ కిల్లర్ జెర్సీని ధరించి సినిమాలోని స్త్రీ పాత్రను దూషిస్తాడు. విద్వేషం కలిగేలా చేస్తాడు. అలాంటి నెగెటివ్ సన్నివేశంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు ఆర్.సి.బి జెర్సీని ధరించడం అభ్యంతరకరం అంటూ సదరు టీమ్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైలర్ సినిమాలో జెర్సీని అవమానిస్తూ ప్రతికూలంగా చిత్రీకరించారని.. జెర్సీని ఉపయోగించే ముందు టీమ్ అనుమతి తీసుకోలేదని పేర్కొంది. తన బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఈ దుర్వినియోగం జరిగిందని RCB పేర్కొంది.
ఇకపై రజనీకాంత్ సినిమాలో ఆర్‌సిబి జెర్సీని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై చిత్రబృందం తర్జనభర్జన పడుతోందని సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు ఈ మార్పు తప్పనిసరి. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ని మనసారా ఆస్వాధిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ మరక ఆయనకు కొంత ఇబ్బందికరమే. అయినా ఇలాంటి తప్పిదాలు భవిష్యత్ లో జరగకుండా జాగ్రత్తపడాలని తదుపరి చిత్రాల దర్శకులకు సూచించారని సమాచారం.
ఆ సీన్ సడెన్ షాక్:
ఇంతటి వివాదానికి కారణమైన ఆ సీన్ ఎక్కడ ఉంది? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి. సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడి మీద హత్యా ప్రయత్నం చేసిన ఇద్దరు రౌడీలు తర్వాత అతడిని చీకట్లో వెంటాడుతారు. ఆ సమయంలో అందులో ఒక దుష్టుడు కోడలి మీద కామెంట్ చేస్తాడు. ఆ సీన్ లో ఒకరి తల నరికి.. ఒకరి గొంతులో పొడిచి భీభత్స దృశ్యమది. ఆ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీని ధరించి కనిపిస్తాడు. ఇది అభ్యంతరకరమని ఆర్సీబీ వాదించింది.