వీడియో : 'మురారి' థియేటర్ లో రియల్ పెళ్లి
ప్రతి థియేటర్ లో కూడా అభిమానులు చేస్తున్న సందడి తాలూకు వీడియో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 9 Aug 2024 8:26 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన గతంలో నటించి సూపర్ డూపర్ హిట్ అయిన మురారి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఒక కొత్త సినిమాకు ఏ స్థాయిలో సందడి, ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉంటుందో అంతకు మించి అన్నట్లుగా మురారి రీ రిలీజ్ కు సంబంధించిన హడావుడి థియేటర్ల వద్ద కనిపించింది, నేడు అంతా కూడా అదే సందడి కొనసాగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రతి థియేటర్ లో కూడా అభిమానులు చేస్తున్న సందడి తాలూకు వీడియో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అన్ని వీడియో లు ఒక ఎత్తు అయితే.. మురారి సినిమా చూస్తూ ఒక జంట పెళ్లి చేసుకున్న వీడియో మరో ఎత్తు. యువకుడు మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు పాట వస్తున్న సమయంలో ఆ యువతి మెడలో పసుపు తాడు కట్టాడు. అక్కడున్న వారు అంతా కూడా వారిని తలంబ్రాలతో ఆశీర్వదించారు. మురారి సినిమా అంటే ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి ఏ స్థాయిలో ఇష్టమో అభిమానమో ఈ సంఘటనతో అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తూ మహేష్ బాబు స్టామినా ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో చేసిన మురారి సినిమా నటుడిగా ఆయన్ను స్టార్ ల సరసన నిలిపింది. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు అంటూ అప్పటి వరకు ఉన్న గుర్తింపు నుంచి మహేష్ బాబు బయట పడటంలో ఆ సినిమా అత్యంత కీలకంగా పని చేసింది అనడంలో సందేహం లేదు. అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కాలంగా మురారి రీ రిలీజ్ ను కోరుకుంటున్నారు. బుల్లి తెరపై సినిమా వందల సార్లు వచ్చినా కూడా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆ ఫీల్ బాగుందని, థియేటర్ లో మళ్లీ మళ్లీ చూడాలని ఆశగా ఉందని కొందరు ఫ్యాన్స్ సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన మురారి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటీ నటులు అయిన సత్యనారాయణ, గొల్లపూడి మారుతి రావు, లక్ష్మి, రవి బాబు ఇంకా ఎంతో మంది ప్రముఖులు నటించారు. మణిశర్మ అందించిన సంగీతం సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. ప్రతి పాట కూడా ఇప్పటికి మహేష్ బాబు అభిమానుల ఫోన్ లలో మారుమ్రోగుతూనే ఉంటుంది. 2001 ఫిబ్రవరి 17న విడుదల అయిన మురారి సినిమా దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత థియేటర్ లో వచ్చినా కూడా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. మరో పాతికేళ్ల తర్వాత వచ్చినా కూడా మురారి ఫ్రెష్ మూవీగానే ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పటికి మురారి కి బ్రహ్మరథం పడతారు అనే అభిప్రాయం ను మహేష్ బాబు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.