Begin typing your search above and press return to search.

బుజ్జిగాడు డైలాగ్.. సలార్ సెట్టయ్యిందిగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ వచ్చేసింది. ఇక శౌర్యాంగ పర్వం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 6:19 AM GMT
బుజ్జిగాడు డైలాగ్.. సలార్ సెట్టయ్యిందిగా..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ వచ్చేసింది. ఇక శౌర్యాంగ పర్వం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తొలి పార్ట్ లో ప్రభాస్కు ప్రశాంత్ నీల్ ఇచ్చే మాస్ ఎలివేషన్లు.. ఫ్యాన్స్ కుర్చీల్లో కుర్చోనివ్వకుండా చేశాయి. ప్రభాస్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఈలలు వేస్తూ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కు తగ్గ కథను ప్రశాంత్ నీల్ అందించారంటూ పొగుడుతున్నారు.

అయితే ప్రభాస్ ను సిల్వర్ స్క్రీన్పై టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చూపించినట్లు ఇంతవరకు ఎవరూ చూపించలేదనే చెప్పొచ్చు. ఈ మూవీలో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. సింపుల్ హీరోయిజంతో ప్రభాస్ కూడా అదరగొట్టేశారు. ఈ మూవీలోని డైలాగ్స్ ను డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికీ వాడుతూ ఉంటారు.

అందులో 'టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా' అనే డైలాగ్ ముందు వరుసలో ఉంటుంది. ప్రభాస్ కటౌట్ కు సరిపోయే పెర్ఫెక్ట్ డైలాగ్ అది. పూరీ జగన్నాథ్ రాసిన ఆ డైలాగ్.. మాస్ అంటే ఏంటో సినీప్రియులకు చూపించింది. ఈ మూవీలో మరో మాస్ డైలాగ్ కూడా అప్పట్లో సెన్షేషనల్ అయింది. "బాగున్నావ్ రా.. ఈ బండి చూసావా.. ఛాతి నంబర్ చూస్తావా.. ఇసుజు ఇంజన్ రయ్ రయ్ రయ్ హార్స్ పవర్ ఎక్కువ" అంటూ ప్రభాస్ సుబ్బరాజ్ కు వార్నింగ్ ఇస్తారు. ప్రభాస్ ఆ డైలాగ్ చెబుతున్నప్పడు మేకర్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన విడుదలైంది. అయితే మూవీలో శ్రుతిహాసన్ను హీరో(దేవ) కాపాడే సమయంలో ప్రభాస్ పిడికిలి బిగించే ప్రయత్నం చేస్తారు. అదే టైమ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఇంజిన్ స్టార్ట్ అయ్యే సౌండ్ వచ్చి ఆగుతుంది. ఆ తర్వాత రెండు సార్లు ప్రభాస్ పడికిలి బిగించే ప్రయత్నం చేయడం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంజన్ స్టార్ట్ అవుతున్నట్లు అయ్యి ఆగిపోవడం జరుగుతుంది.

చివరకు ప్రభాస్ పిడికిలి బిగించగానే బ్యాక్ గ్రౌండ్ లో ఇంజిన్ స్టార్ట్ అయ్యే సౌండ్ పూర్తిగా వస్తుంది. అయితే ఈ సీన్ స్క్రీన్ పై వస్తున్న సమయంలో థియేటర్లో ఉన్నవారంతా బుజ్జిగాడి డైలాగ్ ను గుర్తుచేసుకుంటున్నారు. కొందరు ఆ సీన్ ను షూట్ చేసి సోష్ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫిజిక్కు సరిపోయే విజువల్స్ను ప్రశాంత్ నీల్ ఇచ్చారని కొనియాడుతున్నారు.

మరోవైపు, బుజ్జిగాడు సినిమానే తన ఫేవరెట్ మూవీ అని ప్రభాస్ ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఎన్ని హిట్లు ఉన్నా.. ఆ సినిమానే తనకు బాగా ఇష్టమని చెప్పారు. అలాంటి రోల్ ఇక లైఫ్ లో ప్లే చేయలేనేమో అనిపిస్తుంటుందని తెలిపారు. ఫ్యాన్స్ కు కూడా ఇప్పటికీ బుజ్జిగాడు మూవీనే ఫేవరెట్.