బాలీవుడ్ లో అంత ఈజీ కాదు: రెజీనా
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు ఎదుర్కొన్న అనుభవాల గురించి వివరించారు.
By: Tupaki Desk | 2 Nov 2024 12:30 AM GMTతెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా కాసాండ్రా బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు ఎదుర్కొన్న అనుభవాల గురించి వివరించారు. దక్షిణాది నుంచి బాలీవుడ్ లోకి ప్రవేశించినప్పటి నుంచి భాషాపరమైన సవాళ్లు, వాతావరణంలో తేడా, అలాగే ప్రత్యేకంగా తనకున్న అభిరుచులు మార్చుకోవలన్నా షరతులు ఎదురైనట్లు తెలిపింది.
బాలీవుడ్ లో అవకాశాలు చాలా గొప్ప అనుభవంగా భావించినా, భాషాపరమైన సమస్యలు పెద్ద సవాలుగా మారాయని చెప్పారు. హిందీలో సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడమే కాకుండా, తమదైన ఎక్స్ ప్రెషన్స్ ను అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. దక్షిణాది నటీమణుల కోసం ఈ భాషా అవరోధం కొన్నిసార్లు పెద్ద అడ్డంకిగా మారుతుందని ఆమె అభిప్రాయపడింది.
ముంబైలో ఉండటం, అలాగే అక్కడి పరిశ్రమతో కలిసిపోవడం తప్పనిసరి అని బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టినపుడే అర్థమైందని రెజీనా చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నటీమణుల కోసం, ఈ తరహా పరిసరాలలో ఉండటానికి చాలా కొత్తగా ఉంటుంది. హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకోవాలంటే ప్రతి చిన్న మీటింగ్ లకు హాజరు కావాలని, ఒక విధంగా ముంబై జీవనంతో కలిసిపోవాలని సూచించారు.
బాలీవుడ్ లో ఉన్న పోటీ దక్షిణాది పరిశ్రమలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని ఆమె తెలిపింది. ఇక్కడ ప్రతీ అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వస్తుందని, ఒక్క అవకాశం కూడా వెనుక నుండి చేజారనీయకూడదు. బాలీవుడ్ లో అది చాలా ముఖ్యం.. తమను తాము నిరూపించుకోవడానికి అందరూ ఎంతో కష్టపడుతుండడంతో, పోటీ వాతావరణం దక్షిణాదితో పోలిస్తే మరింత టఫ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రెజీనా బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటిస్తున్నప్పటికీ, ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ఉత్సవం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ చిత్రం సక్సెస్ అయితే తన కెరీర్ కు కొత్త ఊపు వచ్చే అవకాశముందని భావిస్తోంది. దక్షిణాది ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రమోషన్ చేస్తూ, ఒక కమర్షియల్ హిట్ కావాలని కోరుకుంటోంది. రెజీనా తన భవిష్యత్తు ప్రణాళికలను బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమన్వయం చేసుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ లో తాను నటిస్తున్న చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ, దక్షిణాది పరిశ్రమలలో కూడా కొనసాగించాలని భావిస్తోంది.