మర్డర్ కేసులో మరో ఇద్దరు పరారీలోనా?
రేణుకా స్వామి హత్య కేసులో కన్నడు నటుడు దర్శన్, పవిత్ర తో సహా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 14 Jun 2024 12:42 PM GMTరేణుకా స్వామి హత్య కేసులో కన్నడు నటుడు దర్శన్, పవిత్ర తో సహా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వాళ్లందర్నీ స్పాట్ కి తీసుకెళ్లి రీ సీన్ కనస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంకా నిందితుల నుంచి హత్యకు గల లోతైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్నటి రోజున రవి శంకర్ అనే మరో వ్యక్తి చిత్రదుర్గ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మరి ఇతడికి ఈ కేసుతో సంబంధం ఏంటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
రవి ఓ కారు డ్రైవర్. అద్దెకి నడుపుతుంటాడు. రేణుకాస్వామిని చిత్ర దుర్గ నుంచి బెంగుళూరు కు తీసుకొచ్చిన గ్యాంగ్ లో ఉన్నాడు. కానీ ఈ హత్యకు రవికి ఏం సంబంధం లేనట్లే తెలుస్తోంది. కానీ కేసులో 13 మందితో పాటు కొత్తగా మరో నలుగురు పేర్లు కూడా చేర్చారు. ఈ కేసులో రవి పేరు కూడా తెరపైకి రావడంతో రవి ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లను కలిసి తనకు తెలిసిన సమాచారం అందిచాడు.
అనంతరం వారి సమక్షంలో చిత్రదుర్గ డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. అటుపై ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రవి ఇచ్చిన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. `రాఘవేంద్ర, ఇతర నిదితులు రేణుకాస్వామిని బెంగుళూరు తీసుకెళ్లేందుకు రవి కారును అద్దెకు మాట్లాడుకున్నారు. రాఘవేంద్ర చెప్పినట్లే రవి కారును పట్టెనగర్ లోని షెడ్డుకి తీసుకెళ్లాడు. రవిని కారులోనే ఉండమని చెప్పారు. కాసేపటికి రవి కారులోనే నిద్రలోకి జారుకున్నాడు.
ఈ సమయంలోనే షెడ్ లో రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కేసులో కొందర్ని లోంగిపోవాలని ప్లాన్ చేసారు. ఈ క్రమంలోనే రవికి డబ్బు ఆశ చూపి లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నం చేసారు. కానీ రవి భయపడి తన డబ్బులిస్తే వెళ్లిపోతానని చెప్పడంతో తనకు ఇవ్వాల్సిన నాలుగు వేలు ఇచ్చి అక్కడ నుంచి పంపించేసారు. రవితో పాటు మరో ముగ్గురు నలుగురు జూన్ 9న చిత్రదుర్గకి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని రవి స్వయంగా తమకు చెప్పాడని ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది. రవి, అనుకిరణ్ పోలీసులు అదుపులో ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.