సమ్మర్ బాక్సాఫీస్.. ఈగలు వాలకుండా ఇలా..
కానీ కొన్నేళ్లుగా మిడ్ రేంజ్, చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 25 April 2024 5:53 AM GMTఓవైపు ఎండలు.. మరోవైపు ఎన్నికలు.. ఇంకోవైపు ఐపీఎల్.. దీంతో సినీ ప్రియుల దృష్టి మూవీలపై కాస్త తగ్గింది. సెలవులు అయినా విద్యార్థులు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. సెలవులు కూడా లాస్ట్ కు వచ్చేశాయి. అయితే సాధారణంగా వేసవిలో సంక్రాంతి తర్వాత పెద్ద స్టార్స్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. కానీ కొన్నేళ్లుగా మిడ్ రేంజ్, చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
2023 వేసవిలో దసరా, విరూపాక్ష లాంటి మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యి అలరించాయి. మరి ఈసారి కూడా వేసవిలో పెద్ద హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కానట్లే. జూనియర్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ కు వాయిదా పడగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం పక్కానే. ఇటీవల ఓం భీమ్ బుష్ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వగా.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మిక్స్ డ్ టాక్ అందుకుంది.
ఇక మేలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కాకుండా మే నెలలో పెద్దగా చిత్రాలేం రిలీజ్ కావడం లేదు. దీంతో కొన్ని సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. థియేటర్స్ ఖాళీగా ఉంటే కష్టమని బాక్సాఫీస్ వద్ద ఈగలు వాలకుండా పాత సినిమాలను దింపుతున్నారు.
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆది, వకీల్ సాబ్, ప్రేమికుడు చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను యాక్షన్ హీరోగా మార్చిన ఆది సినిమాను మే 19, 20 తేదీల్లో పలు ప్రాంతాల్లో ప్రదర్శించనున్నారు. మే 20వ తేదీ తారక్ బర్త్ డే కనుక.. ఒక్కరోజు ముందు మే 19న ఆది చిత్రం థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ మూవీ అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇక స్టార్ డైరెక్టర్ శంకర్.. 30 ఏళ్ల క్రితం తీసిన ప్రేమికుడు మూవీ మే1వ తేదీన రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే. మూవీకి కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా వకీల్ సాబ్ కూడా రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే మేలో కొత్త సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో థియేటర్స్ లోకి మూడు పాత సినిమాలు వస్తున్నాయన్నమాట. మరి ఏదో ఒక మూవీ రిలీజ్ అయితే చాలు.. అన్నట్లు థియేటర్స్ కు ఆడియన్స్ వస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.