Begin typing your search above and press return to search.

కంగువా తప్పులు.. పుష్ప 2లో జరక్కుండా..

ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా పుష్ప 2 భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   18 Nov 2024 11:30 PM GMT
కంగువా తప్పులు.. పుష్ప 2లో జరక్కుండా..
X

ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా పుష్ప 2 భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా ట్రైలర్ ఇప్పటికే రికార్డులను సృష్టించింది. అయితే, పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ హీరో సూర్య నటించిన కంగువా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదురయ్యాయి.

ఈ విమర్శలపై రసూల్ పూకుట్టి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అలాంటి తప్పు పుష్ప 2లో జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన ఒక హింట్ ఇచ్చారు. అందుకు సంబందించి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రసూల్ పూకుట్టి ట్విట్టర్ లో పుష్ప 2 గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా డాల్బీ లెవల్ 7లో మిక్స్ చేయబడుతుంది. థియేటర్లన్నీ తమ ఆంప్లిఫైయర్లు, స్పీకర్లను పుష్ప 2కి సరిగా ట్యూన్ చేయాలని కోరుతున్నాను. ప్రేక్షకులకు అసలైన థియేట్రికల్ అనుభవం అందించడంలో ఇది కీలకమైనది" అని అన్నారు.

పుష్ప 2 టీమ్ ఎలాంటి చిన్న తప్పు కూడా జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రసూల్ పూకుట్టి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పని చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. కంగువా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులకు అసౌకర్యం కలిగిందని, అయితే పుష్ప 2లో అలాంటి సమస్యలు ఉండవని రసూల్ పూకుట్టి ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమా ప్రతీ ఫ్రేమ్ లో సౌండ్ డిజైన్ అనుభవాన్ని మెరుగ్గా అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రసూల్ పూకుట్టి చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు పుష్ప 2 పై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ పై కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఇప్పటికే సినీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

పుష్ప 2 డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర, సుకుమార్ కథనం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాయో చూడాలి. ఇక జగపతిబాబు, అనసూయ, సునీల్, ఫాహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ ఈ సినిమాకు మేజర్ హైలెట్ పాయింట్ అని టాక్. ఇక సినిమా తప్పకుండా వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను అందుకుంటుంది అని మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ డే నార్త్ లో కూడా సరికొత్త రికార్డు లను క్రియేట్ చేయగలదని చెబుతున్నారు.