Begin typing your search above and press return to search.

వీడియో : డాన్స్‌ స్టెప్పులతో టైటిల్‌కి న్యాయం

'రెట్రో' అనే టైటిల్‌కి కథలో ఎలా న్యాయం చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 March 2025 3:56 PM IST
Kanimaa Song From Retro
X

తమిళ్ స్టార్‌ హీరో సూర్య గత ఏడాది 'కంగువా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డ సూర్య ఫలితంతో ఒకింత అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రస్తుతం నటిస్తున్న 'రెట్రో' సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఆయన కనిపిస్తున్నారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై తమిళ్‌ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో కార్తీక్ సుబ్బరాజ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మంచి స్పందన దక్కించుకున్నాయి. అంతే కాకుండా విభిన్న చిత్రాలుగా పేరు దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే రెట్రో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

'రెట్రో' అనే టైటిల్‌కి కథలో ఎలా న్యాయం చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెట్రో అంటే పాత కాలపు పద్దతిని లేదా స్టైల్‌ను కొత్తగా ఉపయోగించడం. ఈ సినిమా కథలో రెట్రో ఎలిమెంట్స్ ఏం ఉంటాయనా అని సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిందని తెలుస్తోంది. మే 1న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు. కనిమా అంటూ సాగే ఈ పాట వైవిధ్యభరితంగా ఉంది. ముఖ్యంగా రెట్రో డాన్స్‌ స్టెప్పులు పాట స్థాయిని పెంచే విధంగా ఉందని, అంతే కాకుండా పాటను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసే విధంగా డాన్స్ స్టెప్పులు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది.

కథలో రెట్రో ఎలిమెంట్స్ ఏం ఉంటాయో కానీ ఈ పాటలో రెట్రో డాన్స్ స్టెప్స్‌ను చూపించడం ద్వారా దర్శకుడు టైటిల్‌కి న్యాయం చేసినట్లు అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1980 కాలపు స్టెప్స్‌ను సూర్య, పూజా హెగ్డేలతో పాటు డాన్సర్స్‌తో వేయించడం ప్రత్యేకంగా అనిపించింది. కార్తీక్‌ సుబ్బరాజ్ సినిమా అంటే కథ విషయంలోనే కాకుండా ఇలాంటి విషయాల్లోనూ వైవిధ్యం కనబర్చుతాడని మరోసారి నిరూపితం అయింది. సంతోష్ నారాయణ్‌ కంపోజ్‌ చేసిన ఈ రెట్రో సాంగ్‌కి షరీఫ్ రెట్రో స్టైల్‌లో కొరియోగ్రఫీ అందించడంతో సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలతో పోల్చితే ఈ పాట విభిన్నంగా అయితే ఉంది. ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు అనేది చూడాలి.

సూర్య గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఫ్యాన్స్ 'రెట్రో' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డేకు హిట్‌ అత్యంత కీలకం. ఆమె లుక్‌కి ఇప్పటికే పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. కనుక సినిమాలోనూ ఆమెకు మంచి పాత్ర దక్కి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే హీరోయిన్‌కి మినిమం ప్రాముఖ్యత ఉంటుంది. కనుక ఈ సినిమా హిట్‌ అయితే పూజా హెగ్డే మరోసారి బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌లోనూ ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో రెట్రో సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సూర్య మార్కెట్‌ తెలుగులో తగ్గుతూ వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. మరి రెట్రోతో మరోసారి తన మార్కెట్‌ను సూర్య పదిలపరచుకుంటాడా అనేది చూడాలి.