స్టాలిన్ మీటింగ్ కి రేవంత్ కేటీఅర్!
డీలిమిటేషన్ తో మొత్తం దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలకు సీట్లు తగ్గి అతి పెద్ద రాజకీయ నష్టం జరుగుతుందని విశ్లేషణలు ఉన్నాయి.
By: Tupaki Desk | 22 March 2025 12:34 AM ISTడీలిమిటేషన్ తో మొత్తం దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలకు సీట్లు తగ్గి అతి పెద్ద రాజకీయ నష్టం జరుగుతుందని విశ్లేషణలు ఉన్నాయి. దీనిని కనుక అడ్డుకోకపోయినా లేదా డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదిక అన్న సూత్రాన్ని కలపకుండా చేయకపోయినా దక్షిణాదికి ఎప్పటికి భారత పార్లమెంట్ లో సముచితమైన అవకాశాలు దక్కవని కూడా మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో డీలిమిటేషన్ మీద గత కొంతకాలంగా బిగ్ సౌండ్ చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ ఈ నెల 22న ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయిలోనే ఎంతో ప్రాధాన్యత ఉంది. డీలిమిటేషన్ అంటూ మోడీతో డీ కొట్టేందుకు ఏకంగా సౌత్ స్టేట్స్ ని ఐక్యంగా ఉంచుతూ సమిష్టి పోరుకు తెర తీస్తున్న స్టాలిన్ ఇపుడు జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దల ఫోకస్ లో ఉన్నారు.
ఇదిలా ఉంటే డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్ కి జరిగే అన్యాయం మీద అందరితో చర్చించడమే కాకుండా ఏ రకమైన రాజకీయ పోరాటాన్ని కలసికట్టుగా చేయాలి కేంద్రాన్ని ఈ విషయంలో ఏ విధంగా దారికి తేవాలి అన్నది ప్రధాన అజెండాగా చెన్నైలో జరిగే ఈ కీలక భేటీకి చాలా మంది నేతలు హాజరవుతున్నారు.
ఇక చూస్తే తెలంగాణా నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ ఇద్దరు నాయకులు శుక్రవారం రాత్రికే చెన్నై చేరుకున్నారు. వేరు వేరుగా వచ్చిన ఈ ఇద్దరికీ చెన్నై ఎయిర్ పోర్టులో డీఎంకే నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇక ఒకే అంశం మీద ఈ ఇద్దరూ ఒకే మీటింగుకు రావడంతో ఈ అంశం మీద ఇద్దరూ ఏమి మాట్లాడుతారు అన్నది చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్ ఎటూ బీజేపీ తీసుకుని వస్తున్న ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద గుర్రుగానే ఉంటుంది. పైగా దక్షిణాదిన రెండు రాష్ట్రాలలో ఆ పార్టీ అధికారంలో ఉంది. మరో రెండు చోట్ల మిత్రులు అధికారంలో ఉన్నారు. ఏపీ తప్ప అన్ని చోట్లా కాంగ్రెస్ కి బలం ఉనికి ఉన్నాయి.
సో అలా స్టాలిన్ మీటింగ్ కాంగ్రెస్ కి చాలా ముఖ్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఎన్డీయేలో పార్టీలు రెండే ఉన్నాయి. అవి బీఆర్ ఎస్ వైసీపీ. బీఆర్ఎస్ అయితే ఇది దక్షిణాది రాష్ట్రాల ఉనికికి సంబంధించిన అంశం కాబట్టి హాజరవుతోంది. కేటీఆర్ ని పంపడం ద్వారా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
మరి వైసీపీ అధినేత జగన్ ని కూడా డీఎంకే మంత్రులు కలసి మీటింగుకు ఆహ్వానించారు. వైసీపీ నుంచి ఎవరైనా హాజరవుతారా అన్నది చూడాల్సి ఉంది. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, ప్రాంతాలు రాష్ట్రాలే ముఖ్యం. ఆ విధంగా చూసుకునే బీఆర్ఎస్ ఈ మీటింగుకు వెళ్తోంది. మరి వైసీపీ స్టాండ్ ఏమిటో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి అయిన స్టాలిన్ నిర్వహిస్తున్న మీటింగుకు బీఆర్ఎస్ రావడం అంటే రాజకీయంగా బీజేపీకి ఒక జర్క్ ఇవ్వాలని భావించే ఇలా చేసింది అని కూడా అంటున్నారు. సో చూడాల్సిన రాజకీయం చాలానే ఉంది అన్న మాట.