హైదరాబాద్ లో 'సినీ' కాంక్లేవ్.. బాలీవుడ్, హాలీవుడ్ కనెక్షన్!
టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Dec 2024 9:47 AM GMTటాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరవ్వగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరిణామాల నేపథ్యంలో మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే పలువురు సినీ పెద్దలు తమ ఫీలింగ్స్ ను సీఎంతో పంచుకున్నారు.
ఆ సమయంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మాతో పాటు తమకు సినిమా రంగం కూడా ముఖ్యమేనని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ సర్కార్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డు తాము తీసుకొచ్చామని రేవంత్ తెలిపారు. సర్కార్ కు, ఇండస్ట్రీకి వారధిగా ఉండాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజును ఎఫ్ డీసీ ఛైర్మన్ గా నియమించామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని ఈ మేరకు తెలిపారు.
అదే సమయంలో పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే సినిమా రంగ అభివృద్ధి కోసం త్వరలో హైదరాబాద్ లో కాంక్లేవ్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులను హైదరాబాద్ లోని కాంక్లేవ్ కు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కోరారు.
కాంక్లేవ్ అంటే పెద్ద సదస్సు అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటిదే మన హైదరాబాద్ లో నిర్వహించమంటున్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందని.. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఇక్కడికి తీసుకురావాలని చెబుతున్నారు. మరి హైదరాబాద్ లో ఎప్పుడు? ఎక్కడ సినీ కాంక్లేవ్ జరుగుతుందో వేచి చూడాలి.