నంది-గద్దర్ అవార్డులు ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
ఒకవేళ ఇదేగనుక అమలైతే ఏపీ కళాకారులకు డబుల్ ధమాకా బొనాంజ అందుతున్నట్టేనని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 8 Aug 2024 2:45 AM GMTఏపీ నుంచి 'నంది అవార్డులు' ఇస్తారు.. తెలంగాణ నుంచి 'గద్దర్ అవార్డులు' ఇస్తారు. ఇవి రెండూ ప్రభుత్వ అవార్డులు. యేటేటా ఈ పురస్కారాలు టాలీవుడ్ లో ప్రతిభావంతులకు దక్కనున్నాయి సరే.. అయితే ఇక్కడే కొన్ని సందేహాలు..! ఇరు తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతులకు రెండు రాష్ట్రాల అవార్డులు దక్కనున్నాయా? అంటే రెండు సార్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు అందుకుంటారా? లేదూ తెలంగాణ ట్యాలెంట్‌కి తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ ప్రతిభకు ఏపీ ప్రభుత్వం అవార్డులిస్తాయా? అంటూ కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.
గతంలో అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో కేవలం నంది అవార్డులు మాత్రమే ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు నందులు ఉంటాయి.. గద్దర్ అవార్డులు అదనంగా ఇస్తారు. ఒకవేళ ఇదేగనుక అమలైతే ఏపీ కళాకారులకు డబుల్ ధమాకా బొనాంజ అందుతున్నట్టేనని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లో పరిశ్రమ ఉన్నందున ఇక్కడ అందుకుని, అమరావతిలోను ప్రభుత్వ అవార్డులు అందుకుంటారు. ఇది నిజంగా సదకాశమేనని అంతా భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీకళాకారులకు గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టాలీవుడ్ పెద్దలే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేయగా, వెంటనే టాలీవుడ్ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి సహా సినీవర్గాలు స్పందించి తామంతా సీఎం ప్రకటనకు సంతోషంగా ఉన్నామని జవాబిచ్చారు.
ఈ పరిణామం తర్వాత అందరిలో కొన్ని డౌట్లు పుట్టుకొచ్చాయి. అటు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం , ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవార్డులు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోను తెలుగు సినిమాలకు మంచి జరుగుతుంది. అయితే ఇరు రాష్ట్రాల్లోను ఇస్తారా? అంటూ ప్రశ్నించగా ఏపీ ఫిలింఛాంబర్ సెక్రటరీ జే.వి మోహన్ గౌడ్ స్పందిస్తూ.. చిత్రపరిశ్రమలో ఒక పండగలాగా జరిపే వేడుక నంది అవార్డుల వేడుక. దానిని ఇండస్ట్రీ అంతా పండగలా జరుపుకునేది. రాష్ట్రం విడిపోక ముందు నంది అవార్డులు ఇచ్చారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ నంది అవార్డులను కొనసాగిస్తామని చెప్పగా, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సింహా అవార్డులు ఇస్తామని ప్రకటించింది. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలకు జూరీ వేసి సెలెక్షన్ కూడా పూర్తి చేసారు.
అయితే దానికి వ్యతిరేకంగా కొందరు మీడియా ముందుకు వెళ్లి ఈ అవార్డుల ప్రక్రియ సరిగా లేదని విమర్శించడంతో అవార్డుల వేడుకల్ని ఆపేసారు. ఆ తర్వాత నంది అవార్డులపై ఏ ప్రభుత్వం కూడా ఆసక్తిని కనబరిచారు. ఇప్పుడు రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు వచ్చాయి.. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. కాంగ్రెస్ ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది గనుక అవార్డులపై ఆశ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రావడం వల్ల కూడా నంది అవార్డులు ఇస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. సినీపరిశ్రమ ప్రముఖుడైన గద్దర్ పేరుపై అవార్డులు ఇస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పురస్కారాలు అందజేస్తాయి. అయితే ఏ ప్రభుత్వం అవార్డులు ఇచ్చినా 'తెలుగు సినిమా అవార్డులు' అని ఇస్తారు తప్ప.. ప్రాంతీయత అజెండా ఉండదని ఏపీ ఫిలింఛాంబర్ సెక్రటరీ జేవీ మోహన్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రతిభకు తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రతిభకు ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వవు. సినిమాలకు, సినీరంగంలోని టెక్నీషియన్లకు ప్రతిభ ఆధారంగా అవార్డులు ఇస్తారు కానీ ప్రాంతంతో పని లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు.