సినిమా ఇండస్ట్రీపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు... ప్రీ కండిషన్ ఇదే!
హైదరాబాద్ లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 2 July 2024 9:58 AM GMTహైదరాబాద్ లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల యజమానులు, చిరంజీవిపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... కమాండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను తాజాగా ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అవసరమైన జీవోల కోసం ప్రభుత్వాల వద్దకు వస్తున్నారు కానీ... సామాజిక సమస్యలైన సైబర్ క్రైం, డ్రగ్స్ నియంత్రణలో సినీజనాలు సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదని అన్నారు.
ఈ సందర్భంగా అధికారులకూ ఓ సూచన చేశారు రేవంత్. ఇందులో భాగంగా ఎవరైనా కొత్త సినిమా విడుదల సమయంలో టిక్కెట్ రేట్లు పెంచాలని ఎవరైనా అప్లికేషన్ తో వస్తే... వాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైం నియంత్రణకు ఆ సినిమాలో ఉన్న స్టార్స్ తో ఒక ప్రోగ్రాం చేసి ఇవ్వాలని.. అది ప్రీ కండిషన్ అని అన్నారు. ఎంతపెద్దవాళ్లు వచ్చి రికమండేషన్ చేసినా... నిమిషంన్నర నుంచి రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో బైట్ ఇస్తేనే... వెసులుబాటు ఇవ్వాలని అన్నారు.
సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా జనాలు.. తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలని.. అది వాళ్ల బాధ్యత అని రేవంత్ గుర్తుచేశారు! 100 కోట్ల రూపాయల వ్యాపారాం మంచిదే కానీ... ఈ సైబర్ క్రైం, డ్రగ్స్ ని నియంత్రించకపోతే... ఈ సమాజమే నిర్వీర్యం అవుతుందని అన్నారు! ఈనేపథ్యంలో సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీపరిశ్రమపై ఉందని అన్నారు.
ఇదే సమయంలో... గతంలో తాను సినిమాలు చూసేటప్పుడు థియేటర్ లో ప్రధానమంత్రుల కార్యక్రమాలు, వారీ విదేశీ పర్యటనలకు సంబంధించిన రీళ్లను ప్రదర్శించేవాళ్లని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమ పెద్దలు, థియేటర్ల యజమానులు సామాజిక బాధ్యతను మరిచిపోయారని అన్నారు. ఈ సందర్భంలోనే చిరంజీవి ప్రస్థావన తెచ్చారు.
ఇందులో భాగంగా ఇటీవల మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవీ ఓ వీడియోని విడుదల చేశారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఆ వీడియోను పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రతీ ఒక్క స్టార్ ఇలాంటి ఆలోచనతో ఉండాలని, ముందుకు రావాలని రేవంత్ సూచించారు.