Begin typing your search above and press return to search.

రివెంజ్ పాలిటిక్స్ చేస్తే మట్టిలో కలిసిపోవడమే ?

ఈ నీతి సూత్రాన్ని వంటబట్టించుకుంటేనే ఎవరైనా పది కాలాల పాటు చల్లగా రాజకీయాలు చేసుకుంటారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 4:01 AM GMT
రివెంజ్ పాలిటిక్స్ చేస్తే మట్టిలో కలిసిపోవడమే ?
X

ప్రతీకారం అన్నది తగదు. అది మంటలా మారి మనిషిని దహిస్తుంది అంటారు. అవతల వారిని ఏదో చేద్దామనుకుని బరిలోకి దిగితే వారి సంగతి పక్కన పెట్టి అనుకున్న వారే మట్టిలోకి కలసిపోతారు. ఆధునిక రాజకీయ భారతం చెబుతున్నది ఇదే.

ఈ నీతి సూత్రాన్ని వంటబట్టించుకుంటేనే ఎవరైనా పది కాలాల పాటు చల్లగా రాజకీయాలు చేసుకుంటారు. ఇక తెలుగు రాజకీయాలతో మొదలుపెడితే ఇప్పటికి పుష్కర కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉమ్మడి ఏపీలో తనకు బలం ఉందని భావించి అధికార గర్వంతో నాడు జగన్ ని జైలులో పెట్టించింది.

పదహారు నెలల పాటు జగన్ జైలులో ఉన్నారు. దాని ఫలితం ఏమైంది జగన్ బయటకు వచ్చారు. ఏపీలో కాంగ్రెస్ అన్న పార్టీయే లేకుండా భూస్థాపితం చేసి పారేశారు. కాంగ్రెస్ ని తొక్కి జగన్ ఎదిగారు. ఇప్పటికి మూడు ఎన్నికలు వరసగా జరిగితే ఏపీలో ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ కోలుకోలేదు అంటే రివెంజ్ పాలిటిక్స్ దెబ్బ కాంగ్రెస్ కి ఏ రేంజిలో తగిలింది అన్నది అర్ధం చేసుకోవాలి.

ఇక లేటెస్ట్ ఉదాహరణ తీసుకుంటే ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయించారు. ఆయనను 53 రోజుల పాటు జైలులో వేయించారు. కానీ చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తూనే రెట్టింపు బలంతో జనంలోకి వెళ్లారు. ఆయన టీడీపీ కోసం ఏపీ నలుచెరుగులా తిరిగితే ఆయనకు జనాదరణ అద్భుతంగా దక్కింది.

అదే ఎన్నికల్లో పూర్తిగా ప్రతిఫలించి టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని మెజారిటీలు దక్కాయి. జగన్ కి ఆయన పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలి వైసీపీ ఇపుడు బిగ్ ట్రబుల్స్ లో పడింది. ఇది రివెంజ్ పాలిటిక్స్ చేస్తే దక్కే ఫలితం అని మరోసారి రుజువు అయింది.

ఇక తెలంగాణాకు వెళ్తే రేవంత్ రెడ్డి అనే నేతను బీఆర్ఎస్ అధినాయకత్వం జైలులో వేయించింది. ఏకైక కుమార్తె పెళ్ళికి సైతం వెళ్లడానికి ఆయన జైలు గోడల నుంచి కొద్ది గంటల పర్మిషన్ మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. అలా రేవంత్ ని బంధిస్తే ఆయన ఏమీ కృంగి పోలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన బయటకు వచ్చారు.

బీఆర్ స్ కి అసలైన సవాల్ గా మారారు. బలమైన బీఆర్ఎస్ పునాదులనే పెకిలించి వేసే విధంగా రేవంత్ రెడ్డి సాగించిన రాజకీయ పోరాటంలో చివరికి ఆయన సీఎం అయ్యారు. తెలంగాణాను తెచ్చాను అని చెప్పుకున్న కేసీఆర్ ని మాజీని చేశారు. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతో గులాబీ పార్టీ మరింతగా చితికిపోయింది. ఇది రివేంజ్ పాలిటిక్స్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పే నిట్ట నిలువు నిజం.

ఇక జాతీయ రాజకీయాలే తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ని ఆ పార్టీ అధినాయకులను గాంధీ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేస్తూ వచ్చారు. దానికి ప్రతీఫలం అన్నట్లుగా ఆయన పార్టీకి ఈసారి ఫుల్ మెజారిటీ రాకుండా సీట్ల కోత పడింది. అదే సమయంలో కాంగ్రెస్ పెరిగింది. ఇక మోడీ పోటీ చేసిన వారణాసిలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ దారుణంగా పడిపోయింది. కౌంటింగ్ దశలో కొన్ని రౌండ్లలో మోడీ వెనకబడిపోవడమూ జరిగింది అంటే ప్రతీకారం మంట ఎవరిని అంటుకుందో అర్ధం అవుతుంది.

అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా మితిమీరిన దూకుడు చేశారు. రాహుల్ గాంధీనే సవాల్ చేశారు. రాయబరేలీకి పోటీకి వెళ్ళిన రాహుల్ కి అమేధీ అంటే భయం అన్నారు. 2019లో ఆయన్ని ఓడించిన విజయ గర్వంతో ఆమె 2024లో అదే తీరున వ్యవహరిస్తే ఆమెను ఓడించింది రాహుల్ కాదు ఆయన విధేయుడు కేఎల్ శర్మ అనే ఒక సగటు కాంగ్రెస్ నాయకుడు.

గత అయిదేళ్ళుగా అదే పనిగా రాహుల్ ని టార్గెట్ చేస్తూ వచ్చినందుకు స్మృతి ఇరానీ ఓటమి రూపంలో చెల్లించుకున్న భారీ మూల్యం ఇది అని అంటున్నారు. అందువల్ల అధికారం చేతిలో ఉంది కదా అని రివెంజ్ పాలిటిక్స్ కి తెగబడితే రేపు అనే రోజు ఒకటి ఉంటుంది. అది కచ్చితంగా జవాబు చెబుతున్నారు.

ప్రజలు ఎపుడూ ప్రతీకారాన్ని కోరుకోరు. వారికి అందరూ ఆటగాళ్లే. వారు అలాగే చూస్తారు. కానీ ఒకసారి గెలిచిన తరువాత తామే సర్వాధికారులమని భ్రమించిన వారు చేసే విన్యాసాలకు అదే జనం రాజకీయ సన్యాసాలనే కానుకగా ఇచ్చిన ఉదంతాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎదుటి వారిని మట్టి కరిపిద్దామనుకుంటే తామే మట్టిలోకి కలసిపోతారు. నాయకులూ. తస్మాత్ జాగ్రత్త