రివ్యూ 2024: వేడెక్కించిన టాప్ 10 వివాదాలు!
సరిగా భావ వ్యక్తీకరణ లేని నటి అని విమర్శల్ని ఎదుర్కొంది. భన్సాలీ కోడలు కనుకే ఈ అవకాశం అందిందని కూడా విమర్శలు వచ్చాయి.
By: Tupaki Desk | 25 Dec 2024 3:30 AM GMT2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఇలాంటి సమయంలో సినీపరిశ్రమల్లో ఈ ఏడాది విస్త్రతంగా చర్చల్లోకి వచ్చిన వివాదాల గురించి తరచి చూస్తే.... పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన 'జోకర్' కామెంట్ ఫ్యాన్స్‌లో మంటలు పుట్టించిన సంగతి తెలిసిందే. అర్షద్ వార్షీ నోరు అదుపులో ఉంచుకోవాలని, అతడు నటుడిగా ఎందుకు ఎదగలేకపోయాడని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శించారు.
కల్కి 2898 ADలో ప్రభాస్ పాత్రపై అర్షద్ వార్సి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అతడి పాత్రను దర్శకుడు చిత్రీకరించిన తీరు అంతగా బాలేదని విమర్శించారు. ప్రభాస్ ని 'జోకర్'తో పోల్చాడు. హీరో పాత్రపై తన నిరాశను వ్యక్తం చేశాడు. అయితే అతడి వ్యాఖ్యలను ఖండిస్తూ.. టాలీవుడ్ హీరోలు నాని, సుధీర్ బాబు, దర్శకుడు అజయ్ భూపతి వంటి ప్రముఖులు విమర్శించారు. అయితే ప్రభాస్ ఉత్తమ నటుడు అని, అతడు తెలివైన ఎంపికలు చేసుకుంటున్నాడని, తన విమర్శలు కేవలం ఆ పాత్రపై మాత్రమేనని, తనను తప్పుగా అర్థం చేసుకున్నారని అర్షద్ వివరణ ఇచ్చాడు.
ఈ ఏడాది అంతా సల్మాన్ ఖాన్ లైఫ్ టెన్షన్ టెన్షన్ గా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్‌కు, అతడి కుటుంబానికి హత్యా బెదిరింపులు ఎదురయ్యాయి. ఏప్రిల్‌లో అతడి బాంద్రా ఇంటి వెలుపల తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో అతడి భద్రతపై సందేహాలు ఏర్పడ్డాయి. నవంబర్ 8న బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు మరో బెదిరింపు సందేశం వచ్చింది. సల్మాన్ నుంచి డబ్బు డిమాండ్ చేస్తూ మెసేజ్ వచ్చింది. ఇక గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్.. సల్మాన్ ఖాన్ ల వైరం 1998 నాటిది. సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కమ్యూనిటీకి పవిత్రమైన జంతువు అయిన కృష్ణజింకలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సల్మాన్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
సింగం ఒరిజినల్ థీమ్ ని ఉపయోగించుకున్నారని సింగం ఎగైన్ మేకర్స్ కి టి- సిరీస్ నోటీసులు పంపింది. సింగం ఎగైన్ (సింగం 3) చిత్రాన్ని నిర్మించిన రోహిత్ శెట్టితో ఫైట్ కొనసాగగా, దీని తర్వాత 'సింగం ఎగైన్' టైటిల్ ట్రాక్‌లోని ఒరిజినల్ సింగం థీమ్ తొలగించాల్సి వచ్చింది. ఈ విషయంలో రోహిత్ శెట్టి బృందంతో టీ-సిరీస్ కాపీరైట్ ఫైట్ చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది పెద్ద వివాదాల్లో అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకుల గొడవ ఒకటి. బాలీవుడ్ పవర్ కపుల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ బచ్చన్ విడిపోయారనే పుకార్లు కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి. అభిషేక్ నిమ్రత్ కౌర్‌తో రిలేషన్ లో ఉన్నాడని ఊహాగానాలు సాగాయి. అయితే అభిషేక్ - ఐశ్వర్య ఇద్దరూ ఈ పుకార్లను పదేపదే ఖండించారు, తరచుగా వారి వివాహ ఉంగరాలను ధరించడం .. ఇటీవల వారి కుమార్తె ఆరాధ్య స్కూల్ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో కలిసి కనిపించడం ద్వారా గాసిప్‌లకు చెక్ పెట్టారు.
ఏఆర్ రెహమాన్ - సైరాభాను విడాకులు పెను సంచలనం సృష్టించింది. వారి ఉమ్మడి ప్రకటన తర్వాత రెహమాన్ బాసిస్ట్ మోహిని డే తన భర్త మార్క్ హార్ట్సుచ్ నుండి విడిపోయినట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. చాలా మంది రెహమాన్ - మోహిని మధ్య రిలేషన్ షిప్ గురించి చర్చించారు. కానీ మోహిని ఈ పుకార్లను గట్టిగా ఖండించింది. రెహమాన్ తనకు తండ్రిలాంటివాడని, వృత్తిపరమైన బంధాన్ని నొక్కి చెప్పింది. తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.
జూన్‌లో ముంబైలో రవీనా టాండన్ డ్రైవర్‌పై గుంపు దాడి జరిగింది. రవీనా డ్రైవర్ ముగ్గురు మహిళలు తనపై దాడి చేశాడని ఆరోపిస్తున్న దృశ్యం వైరల్ అయింది. జనాలను ఉద్దేశించి మాట్లాడేందుకు రవీనా వాహనం నుంచి బయటకు వెళ్లినప్పుడు తనను మహిళా గుంపు తోసేసి కొట్టినట్లు ప్రచారమైంది. రవీనా మద్యం మత్తులో ఉందని, కారు దిగిన తర్వాత మహిళపై దాడి చేసిందని వారు ఆరోపించారు. ముంబైలోని బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
స్ట్రీ 2 విజయం తర్వాత నటీనటులు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ మధ్య క్రెడిట్ వార్ జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఈ ఘర్షణ విస్త్రతంగా చర్చనీయాంశమైంది. అభిమానుల కారణంగా ఈ వార్ బాగా ముదిరింది. దీనివల్ల కూడా సినిమాకి కలిసొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ హీరామండి లో అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ కఠినమైన విమర్శలను ఎదుర్కొంది. సరిగా భావ వ్యక్తీకరణ లేని నటి అని విమర్శల్ని ఎదుర్కొంది. భన్సాలీ కోడలు కనుకే ఈ అవకాశం అందిందని కూడా విమర్శలు వచ్చాయి.