Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా క్రెడిట్ ఒక్క‌ రాజ‌మౌళికే ఇవ్వాలి

అయితే ఈ విజ‌యాలకు క్రెడిట్ ఎవ‌రికి ఇవ్వాలి? అంటే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ క్రెడిట్ మొత్తం రాజ‌మౌళికే ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2025 4:26 AM GMT
పాన్ ఇండియా క్రెడిట్ ఒక్క‌ రాజ‌మౌళికే ఇవ్వాలి
X

తెలుగు చిత్ర‌సీమ నుంచి వ‌రుస‌గా 1000 కోట్ల క్ల‌బ్ సినిమాలు వ‌స్తున్నాయి. క‌ల్కి 2898 ఏడి, పుష్ప 2 చిత్రాలు గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యాల్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలో ఈ రెండు సినిమాలు సుమారు 3000 కోట్లు వ‌సూలు చేసాయి. ఇది ఏ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌కు సాధ్యం కాని అసాధార‌ణ విజ‌యం. బాలీవుడ్ సైతం ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోంది. దేశంలోని సినీప్ర‌ముఖులంతా టాలీవుడ్ ని కీర్తిస్తున్నారు.

అయితే ఈ విజ‌యాలకు క్రెడిట్ ఎవ‌రికి ఇవ్వాలి? అంటే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ క్రెడిట్ మొత్తం రాజ‌మౌళికే ఇస్తున్నారు. ఆయ‌న నిర్మాత‌ల ఆలోచ‌న మార్చిన దర్శ‌కుడు అని ప్ర‌శంసించారు. పాన్ ఇండియ‌న్ సినిమా అనే బావ‌న రాజ‌మౌళి సుసాధ్యం చేసాడ‌ని, పెట్టిన డ‌బ్బును తిరిగి తేగ‌ల‌మ‌ని రాజ‌మౌళి నిర్మాత‌ల‌కు భ‌రోసానివ్వ‌గ‌లిగాడ‌ని కూడా ఆర్జీవీ ప్ర‌శంసించారు. భారతదేశంలోని దర్శకుల ఆలోచనలను రాజమౌళి ఎలా మార్చాడు అనే దాని గురించి ఆర్జీవీ ప్రస్తావించారు.

ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ.. తెలుగు సినిమాకి ఒక‌ మార్గాన్ని రూపొందించడంలో ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రభావంపై విశ్లేషించారు. మొత్తం తెలుగు సినిమాకి పూర్తి క్రెడిట్ ఇవ్వ‌ను.. ఇది ఒక వ్యక్తి... ఎస్ఎస్ రాజమౌళితో సాధ్య‌మైంది. అతడు తమిళ సినిమా లేదా మలయాళం లేదా గుజరాతీకి చెందినవాడు కావచ్చు. ఆయన తెలుగు సినిమా నుంచి రావడం యాధృచ్ఛికం. అతడు `బాహుబలి`తో ఒక ముఖ్యమైన బెంచ్‌మార్క్‌ని నెలకొల్పాడు అని ఆర్జీవీ అన్నారు. బాహుబలి కేవలం గొప్ప సినిమా మాత్రమే కాదని, పెట్టిన బ‌డ్జెట్‌ని తిరిగి వెన‌క్కి తేగ‌ల‌మ‌నే నమ్మకం నిర్మాత‌ల‌కు కలిగించిందని వివ‌రించారు.

`బాహుబలి` విజయాన్ని రిపీట్ చేయడానికి ఎంతోమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు.. కానీ అలాంటి ఫలితాలను సాధించడంలో విఫలమయ్యారని రామ్ గోపాల్ వ‌ర్మ అన్నారు. ప్రేక్షకులు పెద్ద సినిమాల నుండి భారీ నిర్మాణ విలువలను ఆశిస్తున్నారని `బాహుబలి` నిరూపించింది. కేవలం గ్రాండ్ విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ , విలాసవంతమైన సెట్‌లు ఉంటే సరిపోదు.. మంచి క‌థ, కంటెంట్, దర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ కూడా కావాల‌ని ఆర్జీవీ అన్నారు.

ఇంతకుముందు రాజమౌళి `మగధీర`తో విజయం సాధించడం వల్ల బాహుబ‌లి ఫ్రాంచైజీ నిర్మాతలు బోల్డ్ గా రిస్క్‌లు తీసుకోగలిగారని వర్మ వ్యాఖ్యానించారు. నిర్మాతలలో నమ్మకాన్ని కలిగించినందుకు రాజమౌళికే ఈ క్రెడిట్ ద‌క్కుతుంది. నిర్మాతలు గొప్ప సినిమా చేయడానికి తగినంత డబ్బు ఖర్చు చేయాల‌ని న‌మ్మారంటే రాజ‌మౌళి వ‌ల్ల‌నే. వారు ఖర్చులను తిరిగి పొందగ‌ల‌మ‌నే కాన్ఫిడెన్స్‌ని రాజ‌మౌళి ఫిలిం మేకర్స్‌కి ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.