'గేమ్ ఛేంజర్'ని సమీక్షించిన RGVపై పంచ్‌లు
'గేమ్ ఛేంజర్' విషయంలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఎలాంటి తప్పులు చేసాడో ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సమీక్షలో వెల్లడించారు.
By: Tupaki Desk | 26 Jan 2025 7:30 AM GMTభారీ కాన్వాస్‌తో సినిమాలను తెరకెక్కించడంలో శంకర్ తర్వాతే ఎవరైనా. ప్రముఖ సైంటిస్ట్, యూనివర్శిటీ ప్రొఫెసర్, టెక్నాలజీ గురూ, రచయిత అయిన సుజాత రంగరాజన్ సహకారంతో ఆయన దర్శకుడిగా ఘనవిజయాల్ని సాధించాడు. ది జెంటిల్ మేన్, భారతీయుడు, అపరిచితుడు, ఒకే ఒక్కడు, రోబో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను శంకర్ తెరకెక్కించారు. 2.0 లాంటి భారీ చిత్రాన్ని అతడు అద్బుతంగా తెరకెక్కించినా అది కాస్ట్ ఫెయిల్యూర్ గా మారింది. జీన్స్, శివాజీ లాంటి చిత్రాలు పెద్ద తెరపై ఫ్లాపైనా బుల్లితెరపై హిట్లు.
అయితే అతడి సినిమాల శైలి ఇటీవల చాలా మారిపోయిందని విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాలతో అతడు డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా దిల్ రాజు లాంటి నిపుణుడైన నిర్మాత సహాయ సహకారాలు ఉన్నా కానీ శంకర్ పరాజయాన్ని చవి చూడటం ఆశ్చర్యపరిచింది. 'గేమ్ ఛేంజర్' విషయంలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఎలాంటి తప్పులు చేసాడో ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సమీక్షలో వెల్లడించారు.
శంకర్ తెరకెక్కించిన గత చిత్రాలకు అద్భుతమైన థీమ్ లైన్ ఉంది. ఉన్నతమైన ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాలు విజయాలు అందుకున్నాయి. ఒక సామాన్యుడు ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 'ఒకే ఒక్కడు'లో చూపించాడు. రోబోట్ (ఎంథిరన్) తో ప్రేమలో పడే అమ్మాయి (ఎంథిరన్) కథ అందరినీ ఆకర్షించింది. కానీ గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎలాంటి ఇతివృత్తం లేదు. బలమైన థీమ్ లేకుండా ఎంతగా బడ్జెట్లు కుమ్మరించినా.. చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలు సినిమాను కాపాడలేవని ఆర్జీవీ విశ్లేషించారు. సరియైన థీమ్ లైన్ లేకపోవడం వల్లనే 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద విఫలమైందని ఆర్జీవీ అనలైజ్ చేసారు.
అయితే ఆర్జీవీ నెటిజనుల నుంచి ధీటైన కౌంటర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. గేమ్ ఛేంజర్ ని విశ్లేషించిన ఆర్జీవీ తాను తెరకెక్కించే సినిమాలతో ఎందుకు అపజయాల్ని మూటగట్టుకుంటున్నారో చెప్పాలని చాలామంది విమర్శించారు. ఆర్జీవీ ఇకనైనా తన సినిమాలపై మాత్రమే దృష్టి పెడితే మంచిదని సూచించారు.