అది నిర్మాత- హీరోల మధ్య అండర్‌స్టాండింగ్: ఆర్జీవీ!
స్టార్ హీరోల పారితోషికాలపై పలుమార్లు ప్రశ్నలు ఎదుర్కొన్న ఆర్జీవీ ప్రతిసారీ స్టార్లను సమర్థిస్తూ వస్తున్నారు.
By: Tupaki Desk | 21 Aug 2023 3:56 AM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ల పారితోషికాలు సినిమా బడ్జెట్లో సగానికి మించి ఉంటున్నాయనేది ప్రధాన ఆరోపణ. హీరోయిన్ల పారితోషికాలపై వేటు వేయగలరు కానీ హీరోల ఫీజులు కోసేయలేరు! అంటూ నిర్మాతలపై పంచ్ లు విసిరేవారు ఉన్నారు. అయితే డిమాండ్ సప్లయ్ ఫార్ములా ఇక్కడా అనుసరిస్తారని కొందరు సినీవిశ్లేషకులు చెబుతుంటారు.
స్టార్ హీరోల పారితోషికాలపై పలుమార్లు ప్రశ్నలు ఎదుర్కొన్న ఆర్జీవీ ప్రతిసారీ స్టార్లను సమర్థిస్తూ వస్తున్నారు. తాజాగా 'వ్యూహం' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆర్జీవీని ఓ ఇంటర్వ్యూలో స్టార్ల పారితోషికాల గురించి హోస్ట్ ప్రశ్నించారు. ఆయన యథావిధిగా ఇందులో తప్పేముంది? అని ఎదురు ప్రశ్నించారు.. ముఖ్యంగా మెగా కాంపౌండ్ హీరోల పారితోషికాలపైనా ఈ చాటింగ్ సెషన్ లో డిబేట్ కొనసాగింది. స్టార్లు పారితోషికాలు అందుకోవడం అనేది వారికి నిర్మాతకు మధ్య ఉన్న అండర్ స్టాండింగ్. స్టార్ ముఖవిలువను బట్టి నిర్మాత ఫీజు నిర్ణయిస్తారు. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని ఆర్జీవీ అన్నారు.
నేటి ట్రెండ్ లో పాన్ ఇండియా స్టార్లు 100 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇది మార్కెట్ విలువ పెరిగినందున పరిణామం. స్టార్లు వారికి ఉన్న ఛరిష్మా ఆదరణ బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా పారితోషికాలను పరిశ్రమ నిర్ణయిస్తుంది. అయితే దివంగత దర్శకనిర్మాత డా.దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో స్టార్ల డామినేషన్ ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల వల్ల పరిశ్రమ నాశనమైందని, చిన్న సినిమా బతక్కుండా పోయిందని ఆవేదన చెందేవారు. హీరోలు పారితోషికాలు తగ్గించుకుని నిర్మాతలను కాపాడాలని హితవు పలికేవారు. కానీ దానికి భిన్నమైన వాతావరణం నేడు ఉంది.