ఓదార్పు యాత్రలో జగన్‌ని చూశాకే: ఆర్జీవీ
ఇప్పుడు వ్యూహం ఏం ఉంటుంది? నేనే చెప్పేసాను కదా! జగన్ కి అనుకూలంగా ఉంటుందని ఆర్జీవీ అన్నారు.
By: Tupaki Desk | 16 Aug 2023 5:37 PM GMTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. త్వరలో 'వ్యూహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 2024 ఎన్నికలకు ముందు విడుదలవుతున్న ఈ సినిమా పూర్తిగా వైకాపాకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని, జగన్ నుంచి డబ్బు తీసుకుని వర్మ ఈ సినిమాని తెరకెక్కించారని ప్రచారమవుతోంది. రామ్ గోపాల్ వర్మ అమ్ముడు పోయాడు అంటూ ప్రచారం సాగుతోంది.
ఇవే విషయాలను ప్రముఖ వార్తా చానెల్ హోస్ట్ ఆర్జీవీని ప్రశ్నించగా... అతడు ఆసక్తికరంగా స్పందించాడు. ఈ సినిమాకి వైకాపా వ్యక్తి (దాసరి కిరణ్) నిర్మాతగా కొనసాగుతున్న మాట నిజం. అయితే నేను అమ్ముడు పోయానని అనడం సరికాదని ఆర్జీవీ అన్నారు.
పబ్లిక్ డొమైన్ లో ఎందరో మాట్లాడుతూ ఉంటారు. అమ్ముడు పోవడం అంటే డెఫినిషన్ ఏంటి? నన్ను నమ్మినవారిని ఎదుటివాడి డబ్బు తీసుకుని మోసం చేస్తే అమ్ముడుపోవడం అంటారు. నేను అలా కాదు కదా? అని ఆర్జీవీ అన్నారు.
నేను జగన్ ని చూసిన కోణంలో అతడికి అనుకూలంగా ఈ సినిమా తీశాను అని కూడా ఆర్జీవీ అన్నారు. 2009 నుంచి 2023 వరకూ జగన్ కుటుంబంలో ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా కథాంశం ఉంటుందని ఆర్జీవీ వెల్లడించారు. ఇప్పుడు వ్యూహం ఏం ఉంటుంది? నేనే చెప్పేసాను కదా! జగన్ కి అనుకూలంగా ఉంటుందని ఆర్జీవీ అన్నారు. ఓదార్పు యాత్రలో జగన్ ని చూసి సినిమా తీయాలని అనుకున్నాను. తన తండ్రి చనిపోయాక ఓదార్పు యాత్ర చేయడం అనేది ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగనిది. కానీ జగన్ ఓదార్పు యాత్ర ఆద్యంతం ఎమోషనల్ జర్నీలా సాగింది.
ఆ సమయంలో అతడిపై మంచి అభిప్రాయం కలిగిందని తాను రాజకీయాల్ని అనుసరించనని పాత్రల ఎమోషన్ సైకలాజికల్ యాస్పెక్ట్స్ ఆధారంగా సినిమా తీస్తారని ఆర్జీవీ తెలిపారు. ఇటీవలే వ్యూహం టీజర్ విడుదలై రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో వైయస్ జగన్ - చంద్రబాబు నాయుడు- పవన్ కల్యాణ్ పాత్రలు ఉన్నాయి. జగన్ కుటుంబీకుల పాత్రలను ఆర్జీవీ తెరపై చూపిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యోదంతం సహా రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంట్ విషయాలను ప్రస్థావిస్తున్నారు.