సుశాంత్ సింగ్ బలవన్మరణంపై రియా హాట్ కామెంట్
2020 జూన్ లో కరోనా మహమ్మారీ రంగ ప్రవేశం సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ముంబై నివాసంలో బలవన్మరణం చెందడం సంచలనమైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Oct 2023 12:43 PM GMT2020 జూన్ లో కరోనా మహమ్మారీ రంగ ప్రవేశం సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ముంబై నివాసంలో బలవన్మరణం చెందడం సంచలనమైన సంగతి తెలిసిందే. అతడి మరణం వెనక స్నేహితురాలు రియా చక్రవర్తి హస్తం ఉందని సుశాంత్ సింగ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిందన్న ఆరోపణలపై ఆరు వారాల పాటు రియాను జైలులో ఉంచారు. సుశాంత్ జీవితాన్ని నాశనం చేసిందని కూడా రియాపై శాపనార్థాలు ఉన్నాయి. అరెస్టు తర్వాత కొన్నాళ్లకు ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. మూడు సంవత్సరాలుగా మీడియాకు దూరంగా ఉంది రియా. మీడియాకు అంతగా ఇంటర్వ్యూలు ఇవ్వని రియా ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ, ధనవంతులు పాపులారిటీ ఉన్న వాళ్లు నిరాశకు లోనవుతారన్న నిజాన్ని ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.
సుశాంత్ ఆత్మహత్య వెనక ఏం జరిగింది? అని అడిగినప్పుడు రియా మాట్లాడుతూ, ``నిజం ఏమిటంటే.. ఈ దేశంలో మానసిక ఆరోగ్యం అస్సలు అర్థం కాదు. మనం ఇంకా చిన్నగా అడుగులు వేస్తున్నాం. యువత ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. భారతదేశం మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. కానీ పాపులర్ పర్సనాలిటీ ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యతో ఉంటే ప్రజలు దానిని అర్థం చేసుకోలేరు. అతడికి కీర్తి ఉంది... సక్సెస్ ఉంది.. డబ్బు ఉంది.. ఎందుకు అతడు నిరాశకు గురవుతాడు? అని ప్రశ్నిస్తారు. కీర్తి - డబ్బు కోసం పని చేయడం మనకు నేర్పించినందున ప్రజలు దీనిని అంగీకరించడం చాలా కష్టమ``ని అన్నారు.
ప్రజలు రెండూ ఉండీ నిరాశకు గురైన వారిని చూసినప్పుడు ``వారు దేని కోసం పని చేస్తున్నాను?`` అని ప్రశ్నిస్తారు. సమాజం నెమ్మదిగా మారుతున్నప్పటికీ ధనవంతుడు పాపులారిటీ ఉన్నవాడు, విజయవంతమైన వ్యక్తి మానసికంగా ప్రభావితం కాగలడనే వాస్తవాన్ని ప్రజలు జీర్ణించుకోవడం చాలా కష్టం అని రియా అన్నారు. అనంతరం రియా సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యలను ప్రస్తావించింది. అతడి పరిస్థితి గురించి తనకు బాగా తెలుసునని అంగీకరించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏం ఉన్నాయి? అని ప్రశ్నించగా.. ``అతడి ఆలోచనల్లో మనసులో నేను లేనందున అతడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నేను తెలుసుకోలేకపోయాను. కానీ అతడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడనే నిజం నాకు తెలుసు. అతడు ఏమి చేస్తున్నాడో నాకు తెలుసు`` అని రియా అన్నారు. అతడి కేసుపై ఏజెన్సీలు ఇంకా కసరత్తు చేస్తున్నాయని, వారు తమ తీర్పును ఇస్తారని రియా చక్రవర్తి తెలిపారు.
సుశాంత్ మరణానికి రియా కారణమని ఆరోపణలున్నాయి కదా? అని ప్రశ్నించగా.. పితృస్వామ్య వ్యవస్థ పరిణామాలను రియా నిందించింది. ``నేను అతడి జీవితంలోకి వచ్చినప్పటి నుండి అతడు మారిపోయాడని చాలా మంది అన్నారు. నాకంటే ముందే తనకంటూ ఓ గుర్తింపు ఉండేది. అతడు ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన వ్యక్తి. బాలీవుడ్‌లో ఇంత పెద్ద విజయం సాధించాడు. అది(అతడిది) అదుపులో ఉండే మనసు కాదు`` అని రియా వ్యాఖ్యానించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 2020లో ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ ఇది బలవన్మరణమా? లేక ఏదైనా జరిగిందా? అనే దానిపై విచారణా సంస్థలు ఇంకా ఏదీ తేల్చలేదు.