ఇతరుల కారణంగా పెళ్లితో బుక్కయ్యే యువతి కథ
అద్భుతమైన కామిక్ టైమింగ్, బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో ఆకట్టుకునే రిచా చద్దా ఇలాంటి పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో అభిమానులకు చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 16 Feb 2025 2:30 AM GMTపెళ్లి, పెళ్లి తర్వాత జీవితంలో మార్పులు అనూహ్యమైనవి. కెరీర్ లో సెటిలయ్యే క్రమంలోనే పెళ్లి టైమ్ వచ్చేస్తుంది. ఆఫీస్‌లో సహోద్యోగులు, ఇంట్లో వాళ్లు పెళ్లాడాలని నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంటారు. అలాంటి ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకున్న యువతి జీవితంలో ఏం జరిగింది? అనేదానిని పెద్ద తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన కామిక్ టైమింగ్, బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో ఆకట్టుకునే రిచా చద్దా ఇలాంటి పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో అభిమానులకు చెప్పాల్సిన పని లేదు.
`ఆఖ్రి సోమవార్` పేరుతో ఈ సినిమాని రిచా స్వయంగా నిర్మిస్తున్నారు. రచయితగా, నిర్మాతగా ఈ సినిమాకి తాను పని చేస్తున్నానని రిచా చద్దా తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడిని ఖరారు చేయాల్సి ఉంది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా. తన సహోద్యోగులు, తల్లిదండ్రుల నుండి వివాహం చేసుకోవాలనే ఒత్తిడిని ఎదుర్కొనే ప్రఖ్యాత టీవీ నిర్మాత చుట్టూ కథ తిరుగుతుందని రిచా చెప్పారు. పెద్దల అంచనాలు, సంబంధాలు వ్యక్తిగత ఆకాంక్షలను ఎలా నాశనం చేస్తాయో కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. తన బంధువులు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడం చూశానని, అవన్నీ చూశాక ఈ ఆలోచన వచ్చిందని, ఈ సినిమా కథ హార్ట్ టచింగ్ గా ఉంటుందని రిచా వెల్లడించారు. కాలేజ్ లైఫ్ ముగిశాక జీవితం ఎలా మారుతుందో కూడా తెరపై చూపిస్తామని తెలిపారు.
ఓవైపు కెరీర్ కావాలి.. మరోవైపు భర్త, కుటుంబం కావాలి. ముప్పై వయసుకే కలలు నెరవేరక తీవ్రంగా నిరాశపడి విసిగిపోతారు!! అంటూ రిచా నేటి యువతరం అనుభవాల గురించి ప్రస్థావించారు. ప్రేమ, పెళ్లిపై కొత్త ధృక్పథాన్ని తేవాలనే లక్ష్యంతో ఈ సినిమా చేస్తున్నానని రిచా అన్నారు. వివాహం, సంబంధాలను ఈ సమాజం ఎలా చూస్తుందో ఈ సినిమాలో చూడొచ్చు. అదే సమయంలో వినోదాత్మకంగా ఉంటూనే ఆలోచింపజేసే కథనంతో రక్తి కట్టిస్తుందని రిచా చెబుతున్నారు. నిజ జీవితంలోని పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుందని భరోసానిస్తున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, హీరామండి, ఫుక్రీ, సెక్షన్ 375 లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో ముఖ్య పాత్రలతో రిచా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.