భారతదేశంలో రిచెస్ట్ హీరో? రిచెస్ట్ హీరోయిన్?
భారతదేశంలో సువిశాల వ్యాపార సామ్రాజ్యాల్ని స్థాపించి, తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్న ప్రముఖ హీరోలు ఉన్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 6:58 AM GMTభారతదేశంలో సువిశాల వ్యాపార సామ్రాజ్యాల్ని స్థాపించి, తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్న ప్రముఖ హీరోలు ఉన్నారు. సకలకలావల్లభులు అని వీళ్లకు బిరుదు ఇస్తే తప్పేమీ కాదు. ప్రఖ్యాత ఫోర్బ్స్ సహా పలు అధ్యయన సంస్థల వివరాల ప్రకారం భారతదేశంలో నంబర్ వన్ ధనిక హీరో ఎవరు? అంటే.. కింగ్ షారూఖ్ ఖాన్.. అతడి నికర ఆస్తుల విలువ సుమారు 7300 కోట్లు. షారూఖ్‌కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్ మెంట్స్ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించగా, సినిమాలు, బ్రాండ్ పబ్లిసిటీ సహా పలు వ్యాపార మార్గాల్లో ఖాన్ భారీగా ఆర్జిస్తున్నారని, రియల్ వెంచర్లలోను అతడు పెట్టుబడులు పెడుతున్నాడని జాతీయ మీడియాలు తమ కథనాల్లో ప్రచురించాయి. అలాగే భారతదేశంలో రిచెస్ట్ హీరోయిన్ గా మేటి కథానాయిక జూహీ చావ్లా రికార్డులకెక్కారు. జూహీ నికర ఆస్తి విలువ సుమారు 4600కోట్లు.
కింగ్ ఖాన్ తర్వాత మళ్లీ ఆస్తిలో అంత పెద్ద స్టార్ ఎవరు? అంటే... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున అని సర్వేలు చెబుతున్నాయి. ఒక అంచనా ప్రకారం నాగార్జున అక్కినేని ఆస్తులు సుమారు 3572 కోట్లు (410మిలియన్లు) ఉందని మీడియాలో కథనాలొస్తున్నాయి. నాగార్జున టాలీవుడ్ లోనే కాదు.. దేశంలోనే ప్రభావవంతమైన ధనిక స్టార్ గా ఎదగడానికి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ముందు చూపు, దూరాలోచన, క్రమశిక్షణ ప్రధాన కారణం.
టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాపార దక్షత, దూసుకుపోయే స్వభావం, ప్రయోగాత్మకత గురించి ప్రజల్లోను ప్రముఖంగా చర్చ సాగింది. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా పరిశ్రమలో ఆరంగేట్రం చేసినా, ఆ తర్వాత స్టార్ గా తనదైన ముద్ర వేసి ఇండస్ట్రీ అగ్ర కథానాయకుడిగా ఆయన ఎదిగారు. తండ్రి ఏఎన్నార్ లెగసీని కాపాడడమే గాక.. అసాధారణమైన హార్డ్ వర్క్, డెడికేషన్ తో అంచెలంచెలుగా ఎదిగిన స్టార్. సినీరంగంతో పాటు, రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్‌లో అనుభవజ్ఞుడిగా ఆల్ రౌండర్ నైపుణ్యంతో అతడు ఇంతింతై అన్న చందంగా ఎదిగారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోగా, నిర్మాతగా సంపాదించిన దాని కంటే అతడు రకరకాల వ్యాపార మార్గాల ద్వారా ఆర్జించారని కథనాలొచ్చాయి. 1986లో `విక్రమ్` సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి మూడు దశాబ్ధాల కెరీర్ ని విజయపథంలో నడిపించారు. ఇప్పటికి 90పైగా సినిమాల్లో నటించారు. మరో రెండు మూడేళ్లలోనే సెంచరీ కొట్టేయబోతున్నారు.
హైదరాబాద్ లో ఆయన నివశించే బంగ్లా ఖరీదు రూ.50 కోట్లు ఉంటుందని ఒక అంచనా. అన్నపూర్ణ స్టూడియో విలువ రూ.200 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఔటర్ లో ఫామ్ హౌస్ లు, స్థలాలపైనా పెట్టుబడులు పెట్టారని, విదేశీ హోటల్ రంగంలోను నాగార్జున పెట్టుబడులు మంచి ఫలాల్ని ఇస్తున్నాయని చర్చ ఉంది. నాగార్జున ఇంటి గ్యారేజ్ లో ఖరీదైన కార్లకు కొదవేం లేదు. రేంజ్ రోవర్ ఎవోక్ -65 లక్షలు, ఆడి ఏ7- 1.02కోట్లు, బీఎండబ్ల్యూ 7 సిరీస్- 1.32 కోట్లు, మెర్సిడెస్ ఎస్ క్లాస్ -3కోట్లు విలువను కలిగి ఉన్నాయి. ఇంకా పలు రకాల స్పోర్ట్స్ గూడ్స్, గాడ్జెట్స్ విలువ కోట్లలోనే ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని ఖరీదైన ప్రైమ్ ఏరియాలో ఉన్న ఎన్- కన్వెన్షన్ కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. నగరంలో పలు చోట్ల పబ్స్, ఖరీదైన రెస్టారెంట్స్, కమర్షియల్ కాంప్లెక్సులు నాగార్జున రన్ చేస్తున్నారు. వీటన్నిటి నుంచి వార్షికాదాయం అసాధారణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ (రికార్డింగ్, డబ్బింగ్, డిజిటల్, అన్నపూర్ణ ఫిలింస్కూల్ వగైరా), అన్నపూర్ణ ఏడెకరాల్లో ఇండోర్ స్టూడియోస్ వంటివి ఆయనకు ఆదాయాల్ని అందిస్తున్నాయి. రకరకాల మార్గాల్లో సినీపరిశ్రమకు నాగార్జున కుటుంబం సేవలు అందిస్తోంది.
నాగార్జున ఒక్కో సినిమాకు 20-30 కోట్ల పారితోషికం అందుకుంటారని సమాచారం. బిగ్ బాస్ హోస్ట్ గా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. నాగార్జునకు క్రీడలంటే ఆసక్తి. అందుకే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో `ముంబై మాస్టర్స్` టీమ్‌ను సొంతం చేసుకున్నారు.
2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితా ప్రకారం.. రూ. 7,300 కోట్ల నికర ఆస్తి విలువతో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని, వినోదం క్రీడలలో తమ వెంచర్‌ల ద్వారా రూ. 4,600 కోట్లు సంపాదించిన జూహీ చావ్లా, ఆమె కుటుంబం తర్వాతి స్థానంలో ఉన్నారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఆసక్తికరంగా షారూక్ ఖాన్ ఆస్తులు గత ఏడాది 6300 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఈ నికర ఆస్తి విలువ ఏకంగా 1000 కోట్లు పెరిగి టోటల్ గా 7,300 కోట్ల మార్క్ కి చేరుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పారితోషికాలు, సినిమాల నిర్మాణం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో షారూఖ్ విజయవంతమైన ప్రయాణం సాగించారు. షారుఖ్ ఖాన్ సంపద పెరుగుతూనే ఉంది.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2024 బాలీవుడ్ స్టార్‌లను ముఖ్యమైన సంపద సృష్టికర్తలుగా హైలైట్ చేసింది. 2000 కోట్ల నికర ఆస్తులతో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. సినిమాల్లో నటించడమే కాకుండా హృతిక్ ఫిట్‌నెస్ బ్రాండ్ HRXని కూడా కలిగి ఉన్నాడు. వస్త్ర వ్యాపారంలోను సక్సెస్ సాధించాడు. అమితాబ్ బచ్చన్ సహా అతడి కుటుంబం రూ.1,600 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉండగా, నిర్మాత కరణ్ జోహార్ నికర ఆస్తుల విలువ రూ.1,400 కోట్లు అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నికర ఆస్తి-2900 కోట్లు, అమీర్ ఖాన్ నికర ఆస్తి-1900కోట్లు, అక్షయ్ కుమార్ నికర ఆస్తి-2700 కోట్లుగా ఉన్నాయి.
మెగా కుటుంబం ఆస్తులు:
భారతదేశంలోని ధనిక సెలబ్రిటీ కుటుంబాల్లో మెగా కుటుంబం ఎవరికీ తీసిపోదు. చిరంజీవి సహా మెగా కుటుంబ హీరోలందరి నికర ఆస్తులు కలుపుకుని 6000 కోట్లు ఉంటుందని జాతీయ మీడియాలు గతంలో కథనాలు ప్రచురించాయి. కేవలం చిరంజీవి ఆస్తి 1600 కోట్ల వరకూ ఉందని, చరణ్ కూడా ఇంచుమించు ఇదే రేంజులో కూడబెట్టారని కూడా కథనాలొచ్చాయి. చరణ్ - ఉపాసన జంట ఆస్తులు పెద్ద స్థాయిలో ఉన్నాయి. ప్రఖ్యాత GQ మ్యాగజైన్ 2022 కథనం ప్రకారం.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నికర ఆస్తి విలువ రూ. 1650 కోట్లు. ఈ ఆదాయాలు నటనకు పారితోషికం, వ్యాపార వెంచర్లు, పలు రంగాల్లో పెట్టుబడులు సహా వివిధ వనరుల నుండి వచ్చాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా చిరంజీవి కొనసాగుతున్నారని సదరు కథనం పేర్కొంది.
మహిళా తారల సంపదలు:
జూహీ చావ్లా నికర ఆస్తి విలువ భారతదేశంలోని చాలా మంది ప్రముఖ నటీమణుల సంపదను అధిగమించింది. జుహీ చావ్లా -రూ.4,600 కోట్లు- $580 మిలియన్ కాగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ -రూ.850 కోట్లు- $100 మిలియన్
ప్రియాంక చోప్రా- రూ.650 కోట్లుగా ఉందని కథనాలొచ్చాయి.