Begin typing your search above and press return to search.

సినీప‌క్కీలో స్టార్ హీరో ఇల్లు దోచిన దొంగ‌లు

మ్యాట్రిక్స్ - జాన్ విక్ లాంటి క్రేజీ చిత్రాల‌తో పాపుల‌రైన హాలీవుడ్ స్టార్ కీనూ రీవ్స్ ఇల్లు దోపిడీకి గురైంది. ఇటీవలే తన హాలీవుడ్ హిల్స్ ఇంటిలోకి ముసుగులు ధరించిన దొంగలు చొరబడ్డారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 9:01 AM GMT
సినీప‌క్కీలో స్టార్ హీరో ఇల్లు దోచిన దొంగ‌లు
X

మ్యాట్రిక్స్ - జాన్ విక్ లాంటి క్రేజీ చిత్రాల‌తో పాపుల‌రైన హాలీవుడ్ స్టార్ కీనూ రీవ్స్ ఇల్లు దోపిడీకి గురైంది. ఇటీవలే తన హాలీవుడ్ హిల్స్ ఇంటిలోకి ముసుగులు ధరించిన దొంగలు చొరబడ్డారు. దొంగ‌లు ఇంటిని డ్యామేజ్ చేసి కీనూరీవ్స్ తుపాకీ ని దొంగిలించి పారిపోయారని ప్ర‌ఖ్యాత‌ న్యూయార్క్ పోస్ట్ వెల్ల‌డించింది. లాస్ ఏంజిల్స్ పోలీస్ శాఖ మొదట రాత్రి 7:00 గంటలకు అనామక కాల్ రిసీవ్ చేసుకున్నారు. రీవ్స్ ఇంట్లో దొంగ‌త‌నం జ‌రుగుతోంద‌ని కాల్ అందింది. ఈ ఘ‌ట‌న‌ బుధవారం జ‌రిగింది. కానీ అక్కడ దొంగ‌ను క‌నుగొన‌లేదు. అయితే గురువారం తెల్లవారుజామున 1:00 గంటలకు అలారం మోగడంతో అధికారులు ఐదు గంటల తర్వాత తిరిగి అక్క‌డికి వెళ్లారని మీడియా వెల్ల‌డించింది.

న్యూయార్క్ పోస్ట్ వివ‌రాల ప్రకారం.. ఆ సమయంలో పోలీసులు సెక్యూరిటీ కెమెరాలను ప‌రిశీలించ‌గా.. స్కీ మాస్క్‌లలో కొంద‌రు వ్యక్తులు కిటికీని పగులగొట్టి కీనూ రీవ్స్ ఇంటిలోకి ప్రవేశించడాన్ని గుర్తించారు, ఈ డ్యామేజీ విలువ సుమారు 7 మిలియన్ డాల‌ర్లు. నిందితులు పారిపోయే ముందు ఇంటి నుంచి ఒక తుపాకీని తీసుకుని వెళ్లారని కూడా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రీవ్స్ ఇంట్లో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి.

డిటెక్టివ్‌లు ఇంటి చుట్టూ ఉన్న వీడియోలను ఇరుగుపొరుగు వారి భద్రతా కెమెరాల ఫీడ్ ని ప‌రిశీలిస్తున్నారు. బుధవారం రాత్రి చేసిన మొదటి కాల్ ఎవరి ఇంటి నుంచి వ‌చ్చింది అనేది ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. రీవ్స్ ఇంటిలోకి దొంగ‌లు చొరబడటం ఇదే మొదటిసారి కాదు. 2014లో కీనూ రీవ్స్ ఇంటిలో బ్యాక్ టు బ్యాక్ చొరబాటుదారులను ఎదుర్కొన్నాడు.

అయితే అప్ప‌ట్లో రీవ్స్ ఈ ఘ‌ట‌న‌ల‌తో మేల్కొని జాగ్ర‌త్త తీసుకున్నాడు. అయితే ఒక‌ గుర్తు తెలియని మహిళ కీనూని కలవడానికి అక్కడ ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఒక మ‌హిళ అప్ప‌ట్లో కీనూ ఇంటి నుంచి 911కి కాల్ చేసింది. కేవలం ఒక రోజు తర్వాత, అతను ఇంట్లో లేని సమయంలో మరొక మహిళ తాళం వేయని తలుపు గుండా అతడి ఇంటిలోనికి ప్ర‌వేశించింది. TMZ మ్యాగ‌జైన్ వివ‌రాల‌ ప్రకారం.. క్లీనింగ్ సిబ్బంది పోలీసులను పిలవడానికి ముందు ఆ మ‌హిళ‌ నగ్నంగా తయారై, అక్క‌డ‌ షవర్‌లో స్నాన‌మాడి, అతని స్నానాల గ‌ది పూల్‌లో జ‌ల‌కాలాట‌లు ఆడింద‌ని కూడా వెల్ల‌డించారు. అయితే ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని మానసిక పరీక్షలు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రీవ్స్ అతడి భాగస్వామి అలెగ్జాండ్రా గ్రాంట్ ల‌తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పుకునే వ్యక్తితో వీరు కోర్టులో పోరాటం సాగించ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.