కృష్ణా నదిలో పడిపోయేదాన్ని..అప్పుడే ఎన్టీఆర్ అలా చేసారు!
తాజాగా అన్నగారితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసినా ఆ నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు.
By: Tupaki Desk | 1 May 2024 12:30 AM GMTవెటరన్ నటి రోజా రమణి సినీ ప్రస్తానం గురించి పరిచయం అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా .. కేరక్టర్ ఆర్టిస్టుగానూ పరిశ్రమకి సేవలందించారు. నటసార్వభౌమ ఎన్టీఆర్ తోనూ చాలా సినిమాలు చేసారు. ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో తానో పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన ఘటనని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు కాళ్లు పట్టుకోకపోతే పెద్ద ప్రమాదామే జరిగేదన్నారు. తాజాగా అన్నగారితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసినా ఆ నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
'రామారావుగారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ విజయవాడ కృష్ణా బ్యారేజ్ పై జరిగింది. నేను ఆ బ్రిడ్జ్ పై నుంచి నదిలో దూకేయాలి. కెమెరా డిపార్టుమెంటువారు బ్రిడ్జ్ క్రింద ఉన్నారు. దూకుతున్నట్టుగా నేను మూమెంట్ ఇవ్వాలి. అయితే కెమెరాలో నా ముఖం కనిపించాలంటే నా కాళ్ల క్రింద స్టూల్ లాంటిది కావాలి. కానీ అది అందుబాటులో లేదు. దగ్గరలో ఓ వ్యక్తి దగ్గర ప్లాస్టింగ్ క్యాన్స్ ఉంటే, వాటిపై నిలబడమని ఎన్టీఆర్ చెప్పారు. ఆ క్యాన్స్ జరగకుండా పట్టుకోమని ఓ అబ్బాయికి చెప్పారు.
ఆ క్యాన్స్ నా బరువు తట్టుకునేలా లేవు. నేను ఎక్కగానే అవి జారిపోయేలా ఉన్నాయి. అలా జారిపోతే నేను నిజంగానే నీళ్లల్లో పడిపోతాను. దీంతో నాలో టెన్షన్ మొదలైంది. అది ఎవరికి చెప్పుకోవాలో అర్దం కాలేదు. ఆ క్యాన్స్ జరగకుండా ఆ అబ్బాయి అదుపు చేయలేకపోతున్నాడు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. అది గమనించిన ఎన్టీఆర్ నా దగ్గరకు వచ్చారు. అమ్మాయి నువ్వేమీ భయపడకు .. నీ యాక్షన్ నువ్వు పెర్ఫెక్ట్ గా చేయి అన్నారు. అప్పుడాయన ఒక చేత్తో ఒక కాలు .. మరో చేత్తో క్యాన్స్ పట్టుకున్నారు. నాకు దైర్యం వచ్చి ఆ సీన్ చేసేసాను.
కానీ ఆయన కాళ్లు పట్టుకోవడం చూసి నాకు ఏడుపు వచ్చేసింది. అదీ ఎన్టీఆర్ అంటే.. అదీ ఆయన గొప్పతనం' అని చెప్పుకొచ్చారు. రోజారమణి తెలుగులోనే కాదు భారతీయ భాషలన్నింటిలోనూ ఆమె సినిమాలు చేసారు. తమిళం..మలయాళం..కన్నడం..హిందీ..ఒడియాలో కూడా నటించారు.