థియేటర్‌లో ఫ్రీగా పాప్ కార్న్ కావాలంటే?
హాల్‌లోకి వెళ్లే ముందు ఎవరైతే తమ ఫోన్‌లను కౌంటర్ లో ఇచ్చేస్తారో, వారు షోను ఆస్వాధించడానికి ఉచితంగా పాప్‌కార్న్ అందుకోవచ్చని ఆఫర్ పెట్టారు.
By: Tupaki Desk | 7 Jan 2025 3:51 AM GMTఅవును.. థియేటర్‌లోకి వెళ్లేప్పుడు ఫోన్ వదిలేయ్.. పాప్ కార్న్ ఫ్రీగా పట్టేయ్! ఈ నినాదం తెరపైకి తెచ్చింది ఎవరైనా కానీ, దీని వెనక ఉన్న అసలు కారణం తెలిస్తే నిజంగా అభినందించకుండా ఉండలేం. నిజానికి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ కి అంకితమైపోయాక ప్రజల మధ్య సత్సంబంధాలు తెరమరుగైపోయాయి. ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా, చివరికి బాత్రూమ్ లో ఉన్నా.. ఫోన్ తోనే పని. మనుషుల మధ్య మాట్లాడుకోవడాల్లేవ్. దూరంగా ఉన్న బంధు మిత్రులతో కనీసం నెలలో ఒకసారైనా మాట్లాడే పరిస్థితి లేదు. మనుషుల మధ్య దూరం పెరిగింది. అయితే ఈ గ్యాప్ ని తగ్గించేందుకు ఇది మా ప్రయత్నం అంటూ.. బీహార్‌లోని పూర్నియాలో ఉన్న సింగిల్-స్క్రీన్ థియేటర్ అయిన `రూపబానీ సినిమాస్` యజమాని విషేక్ చౌహాన్ ప్రేక్షకులకు పాప్ కార్న్ ని ఆఫర్ చేసారు.
హాల్‌లోకి వెళ్లే ముందు ఎవరైతే తమ ఫోన్‌లను కౌంటర్ లో ఇచ్చేస్తారో, వారు షోను ఆస్వాధించడానికి ఉచితంగా పాప్‌కార్న్ అందుకోవచ్చని ఆఫర్ పెట్టారు. నిజంగా ఇది ఎంతో ఆలోచింపజేసింది. థియేటర్ లో అడుగుపెట్టే ముందే ఫోన్ ని కౌంటర్ లో ఇచ్చేస్తే, దానివల్ల థియేటర్ లో సినిమాని కూడా పూర్తి శ్రద్ధగా చూసేందుకు అవకాశం ఉంటుంది. సినిమా చూసే సమయంలో పరధ్యానాన్ని తగ్గించుకోవడానికి ఈ విధానం మంచిది. డబ్బు సంపాదన ముఖ్యం కాదు. డిజిటల్ విప్లవంతో చెడిపోతున్న పిల్లలకు మంచి మార్గదర్శనం చేసేందుకు ఈ ప్రయత్నం అని తెలిపారు.
డిజిటల్ వ్యసనం ప్రజలను వేరు చేసింది. మరోవైపు సినిమా థియేటర్లు మనల్ని ఒకరికొకరు దగ్గర చేసే చోటు. అందుకే ఫోన్ లేకుండా రండి అని థియేటర్ యాజమాన్యం ప్రచారం చేస్తోంది. నెటిజనులు దీనిపై వేగంగా స్పందించారు. థియేటర్ యజమాని ఆలోచనను ప్రశంసించారు. అయితే ఫోన్ లేనిదే క్షణకాలం అయినా గడవడం అంత సులువు కాదు. అలాంటిది సినిమా హాల్ లోకి ఫోన్ లేకుండా అడుగుపెడతారంటారా? ఏం జరుగుతుందో చూడాలి.