హృతిక్ రోషన్ కుటుంబంపై డాక్యు సిరీస్!
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌కి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడికి దక్షిణాది రాష్ట్రాల్లోను చెప్పుకోదగ్గ అభిమానులున్నారు.
By: Tupaki Desk | 4 Dec 2024 8:30 PM GMTగ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌కి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడికి దక్షిణాది రాష్ట్రాల్లోను చెప్పుకోదగ్గ అభిమానులున్నారు. హిందీ హీరోల్లో హృతిక్ గురించి తెలుగు ప్రజలకు కూడా బాగా తెలుసు. హృతిక్ నటించిన క్రిష్ ఫ్రాంఛైజీ చిత్రాలకు తెలుగు రాష్ట్రాలు సహా సౌత్ లోను చక్కని ఆదరణ దక్కింది. అయితే హృతిక్ రోషన్ కుటుంబం గురించి తెలుగు ప్రజలు లేదా దక్షిణాది ప్రజలకు అంతగా లోతైన విషయాలు తెలిసేందుకు ఆస్కారం లేదు.
రోషన్ కుటుంబానికి బాలీవుడ్ లో దశాబ్ధాల చరిత్ర ఉందన్నది ఎందరికి తెలుసు? కారణం ఏదైనా కానీ.. ఇప్పుడు రోషన్ కుటుంబం ఓ డాక్యు సిరీస్‌తో ప్రజల ముందుకు వస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ చరిత్రలా.. సురేష్ ప్రొడక్షన్స్ చరిత్రలా ఇకపై రోషన్ ల కుటుంబ చరిత్ర గురించి కూడా మనకు తెలుస్తుంది. రోషన్ కుటుంబం ప్రయాణం, వారి వారసత్వంపై డాక్యు-సిరీస్‌ను ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. రోషన్ లాల్, రాజేష్ రోషన్, రాకేష్ రోషన్, హృతిక్ రోషన్ ల గురించి ఇందులో విఫులంగా చర్చస్తారు. యాంగ్రీ యంగ్ మెన్, ది రొమాంటిక్స్ విజయాల తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ డాక్యుమెంటరీలపై కొత్త ఆసక్తిని పెంచుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ `ది రోషన్స్` పేరుతో మరో డాక్యుమెంటరీని ప్రకటించింది. ఇది రోషన్ ల కుటుంబం .. రోషన్ లాల్, రాజేష్ రోషన్, రాకేష్ రోషన్ , హృతిక్ రోషన్‌ల ప్రయాణం, వారసత్వం చుట్టూ అన్వేషించే కథనంతో వస్తుంది.
సంగీతాన్ని పరిశ్రమకు తీసుకువచ్చిన కుటుంబమిది. రోషన్ ల వారసత్వం.. వారి లోతైన ప్రయాణం మాయాజాలం సృష్టిస్తుంది. హిందీ సినిమాకి మరపురాని క్షణాలను అందిస్తుంది! అని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రోషన్ కుటుంబం తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం గతంలో చెప్పని విషయాలను వెల్లడించడానికి వేచి చూస్తున్నామని రోషన్ లు ప్రకటించారు.
శశి రంజన్ ఈ ప్రతిష్ఠాత్మక డాక్యు-సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. అతడు మాట్లాడుతూ.. ``రోషన్ కుటుంబ ప్రపంచంలోకి ఆహ్వానించి వారి వారసత్వాన్ని ప్రజలకు చూపించే బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు. వారి కథను తెరపైకి తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను`` అని అన్నారు. కళాత్మక రాజవంశానికి పునాది వేసిన దివంగత రోషన్ లాల్ నాగరత్ ఎకెఎ రోషన్ సాబ్ ల గురించి.. దర్శకులుగా భారతీయ వినోద రంగానికి రాకేష్ రోషన్, రాజేష్ రోషన్ , హృతిక్ రోషన్ అందించిన సేవలను డాక్యుమెంటరీలో రూపొందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనాస్ , షామ్ కౌశల్ వంటి వారు రోషన్ కుటుంబం ప్రయాణం గురించి లోతైన విషయాలను ప్రస్థావిస్తారు. డాక్యు సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.