Begin typing your search above and press return to search.

'రోటి కపడా రొమాన్స్' మూవీ రివ్యూ

ఈ వరుసలోనే ఇప్పుడు ‘రోటీ కపడా రొమాన్స్’ చిన్న సినిమా ప్రామిసింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   28 Nov 2024 10:08 AM GMT
రోటి కపడా రొమాన్స్ మూవీ రివ్యూ
X

నటీనటులు: సందీప్ సరోజ్-హర్ష నర్రా-సుప్రజ్ రంగా-తరుణ్ పొనుగోటి-సోను ఠాకూర్-ఖుష్బు చౌదరి-మేఘ లేఖ-నువేక్ష తదితరులు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్-ఆర్ఆర్ ధ్రువన్-వసంత్

నేపథ్య సంగీతం: సన్నీ ఎంఆర్

ఛాయాగ్రహణం: సంతోష్ రెడ్డి

నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్-సృజన్ కుమార్ బొజ్జం

రచన-దర్శకత్వం: విక్రమ్ రెడ్డి

ఈ ఏడాది స్టార్లు లేని కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, 35 లాంటి సినిమాలు మంచి విజయం సాధించి చిన్న చిత్రాలకు ఉత్సాహాన్నిచ్చాయి. ఈ వరుసలోనే ఇప్పుడు ‘రోటీ కపడా రొమాన్స్’ చిన్న సినిమా ప్రామిసింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రాహుల్ (సందీప్ సరోజ్).. హర్ష (హర్ష నర్రా).. విక్కీ (సుప్రజ్ రంగా).. సూర్య (తరుణ్ పొంగులేటి).. హైదరాబాద్ సిటీలో ఒక రూంలో కలిసి ఉంటున్న స్నేహితులు. వీరిలో రాహుల్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటే.. సూర్య రేడీయో జాకీగా పని చేస్తుంటాడు. మిగతా ఇద్దరు ఖాళీగా ఉంటారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ.. వీకెండ్స్ చిల్ అవుతూ సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఒక్కొక్కరుగా అమ్మాయిలు వస్తారు. మొదట్లో అమ్మాయిల సాంగత్యంతో ఈ నలుగురూ గాల్లో తేలిపోతారు. కానీ ఆ అమ్మాయిలతో కొంత జర్నీ తర్వాత సమస్యలు మొదలవుతాయి. ఒక్కొక్కరుగా తమ జీవితాల్లోంచి వెళ్లిపోవడంతో వీరి జీవితాలను శూన్యం ఆవహిస్తుంది. మరి ఆ బాధ నుంచి ఈ నలుగురూ ఎలా బయటపడ్డారు.. తమను మోసం చేశారని అనుకున్న అమ్మాయిలతో ఎలా వ్యవహరించారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘రోటీ కపడా రొమాన్స్’ అనే టైటిల్.. ‘లెట్స్ సెలబ్రేట్ ద బ్రేకప్స్’ అనే ట్యాగ్ లైన్.. ‘ఎ’ సర్టిఫికేషన్.. ఇవన్నీ చూశాక ఇది ఎలాంటి సినిమానో ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేస్తుంది. ట్రైలర్లో కూడా ఏం చూడబోతున్నామో ముందే క్లియర్ కట్ గా చెప్పేసింది టీం. ఇది పక్కా యూత్ ను టార్గెట్ చేసిన సినిమా. ఈ తరంలో కుర్రాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు.. వీళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.. వీళ్ల సరదాలేంటి.. ప్రేమ మీద పెళ్లి మీద కెరీర్ మీద వీరి అభిప్రాయాలేంటి.. రిలేషన్షిప్ ను ఎలా చూస్తారు.. బ్రేకప్ ను ఎలా తీసుకుంటారు.. ఈ విషయాలను రియలిస్టిగ్గా చర్చించిన సినిమా ఇది. కొంచెం అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్.. ఆలోచనలు ఉన్న యూత్ కథలు కావడం వల్ల బోల్డుగానే చూపించే ప్రయత్నం జరిగింది. డైలాగులకు.. సన్నివేశాలకు ఫిల్టర్ ఏమీ వాడలేదు. కాబట్టి కొంచెం ట్రెడిషనల్ ఆడియన్స్ ఇబ్బంది పడొచ్చు. ఫ్యామిలీస్ కు ఇది రుచించకపోవచ్చు. కానీ యూత్ కు మాత్రం ‘రోటీ కపడా రొమాన్స్’ మంచి కిక్కే ఇస్తుంది.

దర్శకుడు విక్రమ్ రెడ్డి ‘రోటీ కపడా రొమాన్స్’ కథను బోల్డుగా చెప్పే విషయంలో ఎంత క్లారిటీతో ఉన్నాడో చెప్పడానికి సోనియా అనే పాత్ర ఉదాహరణ. యవ్వనంలో ఉన్న ఆ అమ్మాయి ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో హీరోయిన్ల రొమాన్స్ చూసి హార్మోన్లు అదుపు తప్పి.. చదువు మీద దృష్టిపెట్టలేని స్థితిలో రిలేషన్‌షిప్ లేకుండా ఎవరైనా అబ్బాయితో శృంగారంలో పాల్గొని ఆ మోహం వదిలించుకోవాలనుకుంటుంది. అందుకోసమే ఓ అబ్బాయిని వెతికి పట్టుకుంటుంది. తనతో రొమాన్స్ చేస్తుంది. ఈ పాత్రను ఆరంభించిన తీరు.. తర్వాత వచ్చే సన్నివేశాలు చూస్తే.. మనం ఏదో బూతు సినిమాలో కూర్చున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ పాత్రను మొత్తంగా తీర్చిదిద్దిన తీరు.. దీనికి ఇచ్చిన పేఆఫ్ చూశాక దర్శకుడి కన్విక్షన్ అర్థమవుతుంది. వల్గర్ క్యారెక్టర్ లాగా కనిపించే ఈ పాత్రను తర్వాత చూసే కోణమే మారిపోతుంది. దాని పట్ల ఒక ఆపేక్ష కలుగుతుంది. ఇలాంటి పాత్రను ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో పెట్టి ప్రేక్షకులను కన్విన్స్ చేయడం అంత తేలిక కాదు. దర్శకుడు ఈ విషయంలో మంచి మార్కులు కొట్టేస్తాడు.

‘రోటీ కపడా రొమాన్స్’లో కథ పరంగా అంత కొత్తగా ఏమీ కనిపించదు. నలుగురు అబ్బాయిలు.. నలుగురు అమ్మాయిలు.. వీరి మధ్య ప్రేమ- రొమాన్స్-బ్రేకప్.. ఈ వ్యవహారమంతా ఎన్నో యూత్ సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. సన్నివేశాలు అంత కొత్తగా ఏమీ కనిపించవు. కాకపోతే బోర్ కొట్టని విధంగా నాలుగు కథలను బాగానే నరేట్ చేశాడు దర్శకుడు. పైన చెప్పకున్న సోనియా పాత్ర టిపికల్ గా ఉండడం వల్ల ఆ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆ జంట మధ్య.. అలాగే సూర్య-దివ్య జంట మధ్య రొమాంటిక్ మూమెంట్స్ యూత్ ను ఆకట్టుకుంటాయి. విక్కీ పాత్ర మంచి హ్యూమర్ తో సాగుతుంది. రాహుల్-ప్రియ అనే జంట మధ్య సాఫ్ వేర్ కంపెనీలో సాగే లవ్ స్టోరీ మాత్రం కొంచెం బోర్ కొట్టిస్తుంది. సినిమా ఆరంభం కూడా కొంచెం డల్లుగా అనిపించినా.. ఆ తర్వాత బాగానే ఊపందుకుంటుంది.

ప్రేమలో ఉన్నపుడు అంతా అద్భుతంగా అనిపించి బ్రేకప్ అన్నపుడు భరించలేని బాధ కలగడం సహజం. లవ్ స్టోరీలు సరదాగా సాగుతున్నపుడు హుషారుగా అనిపించే ‘రోటీ కపడా రొమాన్స్’.. జంటల మధ్య సమస్యలు వచ్చి విడిపోయినపుడు డల్ అవుతుంది. నరేషన్ కొంచెం నెమ్మదిగా సాగడం వల్ల కూడా ప్రి క్లైమాక్స్ భారంగా మారుతుంది. ఐతే ముగింపులో మాత్రం ‘రోటీ కపడా రొమాన్స్’ మెప్పిస్తుంది. రెండు గంటలకు పైగా అబ్బాయిల కోణంలోనే కథను నడిపించి.. అమ్మాయిలను విలన్ల మాదిరి చూపించిన దర్శకుడు.. చివర్లో అమ్మాయిల దృక్కోణాన్ని చూపించి ఈ కథను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఎమోషనల్ గా సాగే చివరి పావుగంట ప్రేక్షకులు మంచి ఫీల్ తో బయటికి వచ్చేలా చేస్తుంది. హ్యాపీ డేస్.. హుషారు లాంటి సినిమాలను గుర్తు చేసే ‘రోటీ కపడా రొమాన్స్’ ఆరంభంలో.. ద్వితీయార్ధంలో స్లోగా అనిపించినప్పటికీ మిగతా చోట్ల మెప్పిస్తుంది. బోల్డ్ టచ్ ఉన్న యూత్ ఫుల్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిసే.

నటీనటులు: ఆర్టిస్టులందరూ కొత్త వాళ్లే అయినా బాగా చేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ సందీప్ సరోజ్.. రాహుల్ పాత్రలో రాణించాడు. ఆర్జే సూర్యగా చేసిన కుర్రాడు చూడ్డానికి బాగున్నాడు. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. విక్కీ పాత్రలో సుప్రజ్ రంగా కామెడీ బాగా చేశాడు. హర్ష నర్రా కూడా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. సోనియా అనే బోల్డ్ క్యారెక్టర్లో ఖుష్బు చౌదరి చాలా బాగా చేసింది. సోను ఠాకూర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. నువేక్ష.. మేఘ లేఖ ఆకట్టుకున్నారు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే. ఎవ్వరూ తమ పాత్రల్లో అసహజంగా అనిపించకపోవడం.. నటనలో తడబడకపోవడం విశేషం.

సాంకేతిక వర్గం: పరిమిత బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ ‘రోటీ కపడా రొమాన్స్’లో సాంకేతిక విభాగాలు మంచి ఔట్ పుటే ఇచ్చాయి. హర్షవర్ధన్ రామేశ్వర్-ఆర్ఆర్ ధ్రువన్-వసంత్.. ఈ ముగ్గురూ కలిసి అందించిన పాటలు యూత్ ఫుల్ గా అనిపిస్తాయి. చార్ట్ బస్టర్ సాంగ్స్ లేకపోయినా.. సినిమాలో ఆయా సందర్భాలకు తగ్గట్లుగా పాటలు బాగానే సాగాయి. సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం కూడా హుషారుగా సాగింది. సంతోష్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు విక్రమ్ రెడ్డి మంచి పనితనం చూపించాడు. తాను అనుకున్న కథను నీట్ గా నరేట్ చేశాడు. తన నరేషన్ కొంచెం స్లో అన్నది తప్పితే పెద్దగా కంప్లైంట్స్ కనిపించవు. బోల్డ్ టచ్ ఉన్న కథ.. క్యారెక్టర్లు రాసుకున్నప్పటికీ సినిమాలో సన్నివేశాలేమీ వల్గర్ అనిపించకుండా చూసుకున్నాడు. కొత్త ఆర్టిస్టులే అయినా అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు.

చివరగా: రోటీ కపడా రొమాన్స్.. యూత్ కు ఎక్కేస్తుంది

రేటింగ్-2.75/5