మెగాస్టార్ రౌడీ అల్లుడుకు 32 ఏళ్లు
ఇందులో 'రౌడీ అల్లుడు' సరిగ్గా 32 ఏళ్ల క్రితం అక్టోబర్ 18న విడుదలైంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 32 ఏళ్లు.
By: Tupaki Desk | 18 Oct 2023 2:24 PM GMT1991..మెగాస్టార్ కెరీర్‌ని మలుపు తిప్పిన ఇయర్. ఈ ఏడాది విడుదలైన గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాలు చిరు క్రేజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో 'రౌడీ అల్లుడు' సరిగ్గా 32 ఏళ్ల క్రితం అక్టోబర్ 18న విడుదలైంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 32 ఏళ్లు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అరవింద్, చిరు తోడల్లుడు డా.కె.వెంకటేశ్వరరావు, పంజా ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఏ.కోదండ రామిరెడ్డి తరువాత రాఘవేంద్రరావుతో అత్యధిక సినిమాలు చేశారు. ఆయనతో చిరు 14 సినిమాలు చేశారు.
అందులో 'రౌడీ అల్లుడు' వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమిదవ సినిమా. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. కల్యాణ్ అండ్ జానీగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి రఫ్ఫాడించారు. జానీ క్యారెక్టర్లో చిరు పలికించిన అభినయం అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుని ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచేలా చేసింది. శోభన, దివ్య భారతి ఇందులో చిరుకు జోడీగా నటించారు. ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, కెప్టెన్ రాజు, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, జె.వి. సోమయాజులు నటించారు.
కల్యాణ్, జానీగా క్లాస్, మాస్ పాత్రల్లో చిరు పలికించిన హావ భావాలు, కల్యాణ్‌గా మారి ఆఫీస్‌లో విలన్‌లని ఓ ఆట ఆడుకునే తీరు, 'అమలా పురం బుల్లోడా..' అంటే డిస్కో శాంతితో కలిసి చేసిన హంగామా ఇప్పటికీ ఎవర్ ఫ్యాన్స్‌ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. చిలుకా క్షేమమా.., కోరి కోరి కాలుతోంది.., లవ్ మీ మై హీరో, ప్రేమా గీమా తస్సాదియ్యా.., స్లోలీ..స్లోలీ..'తద్దినకా తప్పదికా' వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తుంటాయి.
సత్యానంద్ కథతో పాటు ఈ సినిమాకు మాటలు అందించారు. మంచి దొంగ వంటి హిట్ సినిమాతో మొదలైన చిరు, రాఘవేంద్రరావుల కాంబినేషన్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ని తమ ఖాతాలో వేసుకుని బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకుంది. 1991, అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలోనూ శత దినోత్సవం పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమా గురించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇదే.
ఇక ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ తన బావ చిరుకు, హీరోయిన్ శోభనకు మేకప్ అసిస్టెంట్‌గా, కాస్ట్యూమ్ అసిస్టెంట్‌గా పని చేశారట. న్యూజిలాండ్‌లో తొలి సారి ఈ సినిమా కోసం 'చిలుకా క్షేమమా' అంటూ సాగే పాటని చిరు, శోభనలపై చిత్రీకరించారు. అక్కడ మూడు రోజుల పాటు ఈ పాటని షూట్ చేశారట. ఇక ఈ సినిమాకు ముందు 'రౌడీ' అనే టైటిల్‌ని పెట్టాలని అల్లు రామలింగయ్య సూచిస్తే రాఘవేంద్రరావు, రచయిత సత్యానంద్ మాత్రం 'రౌడీ అల్లుడు' అయితే కరెక్ట్‌గా ఉంటుందని ఆ టైటిల్‌ని ఫైనల్ చేశారట.