Begin typing your search above and press return to search.

భీమ్ గెలిచాడు.. మరి రామరాజు?

అలానే ఇప్పుడు 'గేమ్ ఛేంజర్‌' భారాన్ని మొత్తం రామ్ చరణ్ తన భుజాల మీద వేసుకోవాల్సిన అవసరముంది. దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 2:45 AM GMT
భీమ్ గెలిచాడు.. మరి రామరాజు?
X

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన RRR చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఎవరికి ఎక్కువ పేరు వచ్చిందనేది పక్కన పెడితే, వీరిద్దరూ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించారు. ఇద్దరి స్టార్ ట్యాగ్స్ కూడా మారిపోయాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పటికే తారక్ 'దేవర 1' సినిమాతో మరో సక్సెస్ తన అకౌంట్ లో వేసుకున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి చెర్రీ 'గేమ్ ఛేంజర్‌' పై పడింది.

రాజమౌళితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన హీరోలు, ఆ వెంటనే డిజాస్టర్లు రుచి చూస్తారనే ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అయితే 'దేవర' చిత్రంతో హిట్టు కొట్టి మిథ్ బ్రేకర్ గా నిలిచాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌' సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తాడు? ఎన్ని కోట్ల వసూళ్లు రాబడతాడు? తారక్ మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేయగలడా? అంటూ రెండు సినిమాలను పోల్చి విశ్లేషణలు చేస్తున్నారు.

'గేమ్ ఛేంజర్‌' చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలంగా మేకింగ్‌లో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రచారం చేయబడుతోంది. అయితే దర్శకుడు మునుపటి ఫార్మ్ లో లేడు. ఇటీవల ఆయన్నుంచి వచ్చిన 'భారతీయుడు 2' చిత్రం డిజాస్టర్ గా మారడమే కాదు, ట్రోలింగ్ స్టఫ్ గా మారింది. కాబట్టి రామ్ చరణ్ ఫ్యాక్టర్ మీదనే ఈ సినిమాపై జనాల్లో ఆసక్తిని రేకెత్తించాల్సిన అవసరం ఏర్పడింది.

నిజానికి 'దేవర' కంటే ముందు కొరటాల శివ 'ఆచార్య' వంటి డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ ఒక్కడే సినిమాని తన భుజాన వేసుకొని జనాల్లోకి తీసుకెళ్లాడు. పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ చేసి సినిమాకి బజ్ తీసుకొచ్చాడు. యావరేజ్ కంటెంట్ అయినా సరే, తన స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద సినిమాని నిలబెట్టాడు. అలానే ఇప్పుడు 'గేమ్ ఛేంజర్‌' భారాన్ని మొత్తం రామ్ చరణ్ తన భుజాల మీద వేసుకోవాల్సిన అవసరముంది. దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.

'దేవర' సినిమాకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. నాలుగు చార్ట్ బస్టర్ సాంగ్స్ తో పాటుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇవి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక్కడ 'గేమ్ ఛేంజర్‌' మ్యూజిక్ విషయానికొస్తే, ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు పాటలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఎస్. థమన్ రేంజ్ కు తగ్గట్టుగా సాంగ్స్ లేవనే కామెంట్స్ వచ్చాయి. సో ఈ సినిమాకి బజ్ క్రియేట్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత చరణ్ మీద ఉంది.

అయితే సంక్రాంతికి విడుదల అవుతుండటం 'గేమ్ ఛేంజర్' కు కలిసొచ్చే ప్రధాన అంశం. మామూలుగానే పొంగల్ సీజన్ లో వచ్చే సినిమాలకు టాక్ ఎలా ఉన్నా, ఓపెనింగ్స్ కు డోకా ఉండదు. అదే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రామ్ చరణ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద తిరుగుండదు. ఇప్పటికైతే RRR హీరోలలో భీమ్ హిట్టు కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. మరి రామరాజు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు? భీం మీద పైచేయి సాధిస్తాడా లేదా? అనేది వేచి చూడాలి.